నేర పరిశోధనలో సమర్థులకు ప్రోత్సాహం

6 Feb, 2021 03:56 IST|Sakshi
ఎస్సై శిరీషకు అవార్డు అందిస్తున్న డీజీపీ

పోలీసులకు అవార్డుల ప్రదానోత్సవంలో డీజీపీ సవాంగ్‌

సాక్షి, అమరావతి: నేర పరిశోధనలో సమర్థులను గుర్తించి అవార్డులతో ప్రోత్సహించడం ద్వారా మిగిలిన వారిలో స్ఫూర్తిని రగిలించినట్లవుతుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ‘అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ ఇన్‌ క్రైమ్‌ డిటెక్షన్‌(ఏబీసీడీ)’లను అందించారు.  నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 66 మందికి డీజీపీ బహుమతులు అందించారు. మొదటి, రెండు, మూడవ బహుమతులుగా రూ.లక్ష, రూ.60 వేలు, రూ.40వేల నగదుతోపాటు ప్రశంసాపత్రాలు అందించారు.

► విజయవాడ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఉయ్యూరులో రూ.60 లక్షల చోరీని ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన విజయవాడ సీసీఎస్‌ పోలీస్‌ టీమ్‌కు 2020 సెకండ్‌ క్వార్టర్‌ ఏబీసీడీ కింద మొదటి బహుమతి దక్కింది. సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ కె.శ్రీనివాసరావు మరో 9 మంది అవార్డును అందుకున్నారు. రెండు, మూడు బహుమతులను మదనపల్లె డీఎస్పీ కె.రవిమనోహరాచారి బృందం.. గుంటూరు అర్బన్‌లోని దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు బృందం అందుకున్నాయి. కారు చోరీ కేసులో తీగలాగితే 15 క్రిమినల్‌ కేసుల్లోని గ్యాంగ్‌ను నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌ టీమ్‌ పట్టుకోవడంతో 2020 మూడవ క్వార్టర్‌ అవార్డుల్లో మొదటి బహుమతి దక్కింది. కోవూరు సీఐ జి.రామారావు బృందం అవార్డు అందుకుంది. రెండు, మూడు బహుమతులను చిత్తూరు జిల్లా పీలేరు సీఐ ఎ.సాదిక్‌ అలీ బృందం.. మార్కాపురం అడిషనల్‌ ఎస్పీ కె.చౌడేశ్వరి బృందం అందుకున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి నా సెల్యూట్‌: ఎస్సై శిరీష
మహిళలను ప్రోత్సహించడంతోపాటు వారి రక్షణకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్‌ శాఖకు సెల్యూట్‌ చేస్తున్నానని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్సై కత్తూరు శిరీష కృతజ్ఞతలు తెలిపారు. రెండ్రోజుల క్రితం అనాథ శవాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన శిరీషకు డీజీపీ చేతుల మీదుగా డీజీపీ కమాండేషన్‌ డిస్క్‌ అవార్డును అందజేశారు. తుపాను సమయంలో వరదల్లో చిక్కుకున్న ఒడిశా పోలీసుల ప్రాణాలను కాపాడిన ఎచ్చెర్ల ఎస్సై రాజేష్‌కు కూడా డీజీపీ కమాండేషన్‌ డిస్క్‌ను అందజేశారు. అలాగే పోలీస్‌ మెడల్‌ కూడా దక్కింది. 

మరిన్ని వార్తలు