రకరకాల డైరీలు.. జ్ఞాపకాలను దాచేయండి

4 Jan, 2021 08:33 IST|Sakshi

సాక్షి, కడప కల్చరల్‌: ప్రతిరోజు ఓ జ్ఞాపకం.. ఏడాది పొడవునా మనసును తాకిన సంఘటనలన్నీ స్మృతి నుంచి జారిపోకుండా జ్ఞాపకాల దొంతరగా పేర్చుకునేందుకు మంచి అవకాశం. ఏరోజుకారోజు మనసును కదిలించిన సంఘటనలు.. కమ్మని జ్ఞాపకాలు.. ఉద్వేగాలు.. విషాదాలు.. ఇలా అన్నింటినీ క్లుప్తంగా, పదిలంగా దాచుకునే చోటు డైరీ. ఆ తర్వాత ఎప్పుడో తీరిక వేళల్లో ఒక్కొ పేజీ తిరిగేస్తుంటే ఆ జ్ఞాపక పుటల్లో సంతోషాలు, భావోద్వేగాలు ఇలా ఎన్నెన్నో తియ్యని గాయాలు, మూడ్‌ వచ్చినపుడు రాసుకునే చిన్న గేయాలు, మధురమైన జ్ఞాపకాలు అన్నీ మనసుకు ప్రతిబింబాలు.  రోజువారి జీవితంలో జరిగే సంఘటనలను వరుసగా క్రమపద్ధతిలో రాసుకునేందుకు డైరీ ఎంతగానో పనికి వస్తుంది. జరిగిన విషయాలేగాక వాటి పట్ల మన ప్రతి స్పందనను కూడా పొందుపరచవచ్చు. వర్తమానం గతమై, భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేసేందుకు డైరీ మంచి మిత్రుడిగా ఉపయోగపడుతుంది. ఎవరితోనూ చెప్పుకోలేని విషయాలను డైరీ పంచుకోవచ్చు.

తీపి జ్ఞాపకం
ఓ మోస్తరు డబ్బు ఉన్న వాళ్ల నుంచి అతంత్య ధనికులైన వారికి మాత్రమే పరిమితమై ఉండిన డైరీ ఆ తర్వాత మధ్యతరగతి వరకు వచ్చింది. మొన్నమొన్నటి వరకు ఆధునిక జీవితంలో డైరీలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్ల రాకతో ఇటీవల జోరు తగ్గినా నేటికీ వీటిని వాడేవారి సంఖ్య తక్కువేమి కాదు. అందులో బరువు దించుకుంటేగానీ మనసు తేలిక పడదని భావించే వారు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు గతం పేజీలు తిరిగేస్తే డైరీల్లో మనం రాసుకున్న విషయాలు రాసింది మనమేనా అని ఆశ్చర్యం వేస్తోంది. కావాల్సినపుడు తిరిగేసుకుని ఆ జ్ఞాపకాలను నెమరేసుకునేందుకు డైరీలను వీలైనంత ఎక్కువకాలం ఓ మధురమైన నిధిలా దాచుకుని ఆనందిస్తుంటారు.

ఎన్నో రకాలు 
డైరీలను పలు రకాలుగా వాడేవారు కూడా ఉన్నారు. తమ అనుభూతులను భావుకంగా కవితల్లా రాసుకునే వారు ...అడ్రసులు, ఫోన్‌ నంబర్లు రాసుకునే వారు, చివరికి లాండ్రి పద్దు రాసుకునే వారు కూడా లేకపోలేదు. మొత్తంపై డైరీ రాయడం హుందాతనానికి గుర్తుగా భావిస్తారు. కొన్నేళ్ల తర్వాత మనం రాసిన విషయాలు మనకే గమ్మత్తుగా అనిపిస్తాయి. అందుకే పలువురికి నేటికీ డైరీ రాసుకునే అలవాటు ఉంది. ఎందరో మహానుభావులు అలా రాసిన ఆ డైరీలు తర్వాత కొన్నేళ్లకే మంచి గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. చారిత్రక గ్రంథాలుగా మారి చరిత్ర సృష్టించాయి.

డైరీ రాసే వారి కోసం సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లలో రకరకాల, రంగురంగుల డైరీలు కళకళలాడుతాయి. ఎన్ని రకాల డైరీలున్నా టీటీడీ డైరీకి మంచి డిమాండ్‌ ఉంది. వీటిని ఇటీవల కేవలం టీటీడీ అనుబంధ సంస్థల కౌంటర్లలోనే విక్రయిస్తున్నారు. ఖరీదైన లెదర్, రెగ్జిన్‌ లెదర్‌ బైండింగ్‌ గలవి, పర్సు, పెన్‌ స్టాండ్, గడియారం, క్యాలికులేటర్లు సౌకర్యం గలవి కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద నగరాలలో 8జీబీ పెన్‌డ్రై వ్, గడియారం, క్యాలిక్యులేటర్, పెన్, కంపాస్‌ సెట్‌ తదితరాల కాంబినేషన్‌లో కూడా లభిస్తున్నాయి. పెట్టెలలాగా తాళం వేసుకునే అవకాశం గల డైరీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

దేశదేశాల మ్యాపులు, సమయాలు, రాజధానులు, పిన్‌కోడ్, ఫోన్‌ కోడ్‌ నెంబర్లు, పోస్టల్, రైల్వే సమాచారం, ప్రకృతి, ఆధ్యాత్మికం, సామాజిక సేవ, ఇంజనీరింగ్, ఎగ్జిక్యూటివ్‌ అంశాలను దాదాపు ప్రతి పేజీలో పొందుపరిచిన డైరీలు కూడా లభిస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వైద్యులు తదితర ఉద్యోగాల్లో ఉన్న వారికి అసవరమైన సమాచారంతో కూడిన డైరీలు కూడా లభిస్తుండడం విశేషం.    స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, కంపెనీలు నూతన సంవత్సర కానుకగా డైరీలు అందజేస్తున్నాయి. ఉద్యోగుల్లో సంఘాల ద్వారా కూడా తమకు సంబంధించిన వివరాలు, జీఓలతో ప్రత్యేకంగా డైరీలను రూపొందిస్తున్నారు.  మంచి హాబీని మనం కొనసాగిస్తూ పిల్లలకు కూడా అలవాటు చేద్దాం!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు