పేదల కళ్లల్లో ఆనందం

1 Jan, 2021 05:15 IST|Sakshi
బుడంపాడులో ఇంటి పట్టా అందజేస్తున్న హోం మంత్రి మేకతోటి సుచరిత, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు

రాష్ట్ర వ్యాప్తంగా ఏడో రోజూ కొనసాగిన ఇళ్ల పట్టాల పంపిణీ 

సాక్షి నెట్‌వర్క్‌: పేదల జీవితాల్లోకి వేవేల సంక్రాంతి వెలుగులు ఒక్కసారిగా వచ్చినట్లుంది. సొంతింటి కల సాకారం అవుతోందన్న ఆనందం అక్కచెల్లెమ్మల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించినప్పటి నుంచి పట్టాల పంపిణీ నిర్విఘ్నంగా సాగుతోంది. ఏడో రోజైన గురువారం  రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. గురువారం పంపిణీ చేసిన పట్టాలతో సహా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో  86,488 , కృష్ణాజిల్లాలో, 62,670 పట్టాలను పంపిణీ చేశారు.  ప్రకాశం జిల్లాలో 26,476, తూర్పుగోదావరి జిల్లాలో  63,384 మందికి పట్టాలు పంపిణీ పూర్తయింది. పశ్చిమగోదావరి జిల్లాలో   59,177 మందికి ఇళ్ల పట్టాలు అందించారు.  

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా  32,560, విశాఖ జిల్లాలో 26,345 మందికి పట్టాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లాలో  17,165 పట్టాల పంపిణీ పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలో 14,193 మంది లబ్ధిదారులు పట్టాలు అందుకున్నారు.  వైఎస్సార్‌ జిల్లాలో  54,421 మంది ఇళ్ల పట్టాలు అందుకున్నారు. కాగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7వ రోజు గురువారం 8,498 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం 2,839 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో గురువారం 3,889 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి  మంత్రులు మేకతోటి సుచరిత ,కొడాలి నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు. 

ఇప్పుడు బంధువులు వస్తారేమో!
నా భర్త 40 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇద్దరు ఆడబిడ్డల్లో పెద్ద బిడ్డ అనారోగ్యంతో మృతి చెందింది. మనవడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కూతురి కుటుంబం ఊరు వదిలి వెళ్లిపోయింది. రెక్కల కష్టం చేసే ఓపిక లేదు. పింఛనే ఆధారం. చిన్న ఇంటిలో ఒక్కదాన్నే అద్దెకు ఉంటున్నాను. ఇప్పుడు నాకు ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తామని జగనయ్య చెప్పాడు. చాలా సంతోషంగా ఉంది. నా సొంత ఇంట్లోనే తనువు చాలిస్తానన్న ధైర్యం వచ్చింది. ఇంటి కోసమైనా దూరంగా ఉన్న బంధువులు వచ్చి నా కర్మకాండలు సక్రమంగా చేస్తారేమో. నాకు ఇల్లు కట్టిస్తున్న ఆ మహానుభావుడు చల్లగా ఉండాలి.
– తమ్మిశెట్టి చినకాకమ్మ, నరమాలపాడు, గుంటూరు జిల్లా.  

మరిన్ని వార్తలు