నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూ ప్రకంపనలు.. పెద్ద శబ్ధంతో మూడు సెకన్లపాటు కంపించిన భూమి

14 Aug, 2022 05:05 IST|Sakshi

దుత్తలూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)/ పామూరు: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధంతో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళన చెంది ఇళ్లలోంచి పరుగులు తీశారు. కాగా, కలిగిరి మండలంలోని గంగిరెడ్డిపాళెం, తెల్లపాడు, కృష్ణారెడ్డిపాళెం ప్రాంతాల్లో శనివారం రాత్రి 9.11 గంటల సమయంలో నాలుగు సెకన్లపాటు పెద్ద శబ్ధంతో భూమి స్వల్పంగా కంపించింది.

పామూరులో..
ప్రకాశం జిల్లా పామూరు తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం సుమారు 5.20 గంటల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు రెండు మార్లు స్వల్పంగా భూమి కంపించింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆకులవీధి, కాపువీధి, ఎన్‌జీవో కాలనీతోపాటు మండలంలోని ఇనిమెర్ల, నుచ్చుపొద, వగ్గంపల్లె, రావిగుంటపల్లె సహా పలు గ్రామాల్లో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదిలాయి. ఆకులవీధి, కాపువీధిలోని ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి వచ్చారు. 

మరిన్ని వార్తలు