కుహానా మేధావి విశ్లేషణ.. ఈనాడు అర్థం, పర్థం లేని రాతలు.. ఆ ముచ్చట మళ్లీ చెప్పడానికి ఇంటర్వ్యూ ఎందుకు?

11 May, 2023 10:44 IST|Sakshi

ఈనాడు దినపత్రిక అసూయ, అక్కసు, అసహనం వంటి సమస్యలతో రగిలిపోతుంది. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవని భయపడుతోందో ఏమో తెలియదు కానీ, నిత్యం అసత్యాల, అర్థం ,పర్థం లేని వార్తలతో పత్రికను నింపేస్తోంది. టీవీలలో గంటల కొద్ది తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోంది. వారం లేదా పదిహేను రోజులకోసారి ఏపీలో అప్పులు పెరిగిపోయాయని.

ఏదో అయిపోతోందని అంటూ చెత్త కథనాలు వండి వార్చుతోంది. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా ఉంది. ఎవరో ఒకరిని మేధావి అంటూ టాగ్ తగిలించి వారితో మాట్లాడిస్తోంది. వారు కుహానా మేధావులో, నిజంగానో మేధావులో  కానీ, ఈనాడు, తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు.

ఆ మధ్య ఒక మహిళా మేధావి అంటూ అప్పులపై మాట్లాడించారు. తాజాగా ఎవరో జీవీ రావు గారట.. ఆయనను పట్టుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే విమర్శలు చేస్తోందో అవే వ్యాఖ్యలు ఈయన చేయడం ద్వారా తన అసలు రంగును ఆయన బయటపెట్టుకున్నారనిపిస్తుంది. వీరు నిజమైన మేధావులే అయితే, రాష్ట్రానికి ఎంత అప్పు ఉండాలి? ఎంత ఉంది? ఎందుకు పెరిగింది? కరోనా వంటి సంక్షోభాలలో అప్పులు చేయాలా? వద్దా?

ప్రజలకు వివిధ స్కీముల ద్వారా డబ్బు ఇవ్వడం వల్ల జీఎస్డీపీ పెరిగే అవకాశం ఉందా? లేదా? నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ వంటివారు ఈ స్కీములపై ఏమి చెప్పారు. ప్రమాదకర పరిస్థితిలో అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. రుణాలకు సంబందించి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విధి,విధానాలను అమలు చేస్తోంది. వాటిని దాటి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లడం చాలా కష్టం.

ఉదాహరణకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం మితిమీరి అప్పులు చేసిందని చెప్పి, ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు పదిహేడు వేల కోట్ల రుణంపై కోత విధించింది. గత ప్రభుత్వం సుమారు రెండు లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పుడు కూడా బడ్జెట్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ల ద్వారా అప్పులు చేశారు.

అప్పుడేమో రాష్ట్రం సిరిసంపదలతో తులతూగినట్లు, ఇప్పుడేమో శ్రీలంక అయిపోయినట్లు ఈ కుహానా మేధావులు చిత్రీకరించే యత్నం చేయడం దారుణంగా ఉంది. ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఈ మేధావులంతా 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాను రైతులకు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన  లక్ష కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసేస్తానని చెబితే ఆహా,ఓహో అని అన్నారు.

చంద్రబాబుకు ఉన్న సీనియారిటీతో అది సాధ్యమేనని టీవీలలో కూర్చుని మరీ వాదించేవారు. తీరా ప్రభుత్వం వచ్చాక నాలుక మడతేసినా వీరు కూడా కిమ్మనలేదు. 2019 ఎన్నికల ముందు పసుపు -కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ మహిళలకు ,రైతులకు డబ్బు పంచితే , ఇంకేముంది వీరంతా చంద్రబాబుకు ఓటు వేసేస్తారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారు అని డబ్బా కొట్టారు. వీరికన్నా రైతులు, మహిళలకే ఎక్కువ విజ్ఞత  ఉంది కనుక ఈ మేధావుల అసత్య ప్రచారాన్ని నమ్మలేదు.

అయినా వారు మళ్లీ ఎన్నికల ముందు బయల్దేరినట్లుగా ఉంది. జీవీ రావు అనే మేధావి విశ్లేషించదలిస్తే, రెండు ప్రభుత్వాల తీరును పోల్చి మంచి సలహాలు ఇస్తే బాగుండేది. ఆయన అలా చేయలేదు. పైగా చిత్రమైన వాదన చేశారు. ప్రజల జేబుల్లో పది రూపాయలు పెట్టి, వారి నుంచి వంద రూపాయలు తీసుకుంటోందని ఈయన అన్నారని ఈనాడు రాసింది. ఆయన నిజంగానే అలా అని ఉంటే ఆర్దిక నిపుణుడు ఎలా అవుతారో అర్థం కాదు.  

ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు గుంజుకుంటే అసలు అప్పులు చేయవలసిన అవసరం ఏమి వస్తుంది? ఆర్థిక సమస్యలు ఎందుకు ఉంటాయి? ఇది కనీస ఇంగితం  కాదా! ఉచితంగా ఇచ్చే మొత్తాలకన్నా అధికంగానే ప్రజల నుంచి తీసుకుంటోందని ఆయన చెప్పారట. అది ఏ రకంగానో వివరించాలి కదా? తెలుగుదేశం నేతల అర్థరహిత ప్రచారానికి ,ఈయన అభిప్రాయానికి ఏమైనా తేడా ఉందా?

ఒక ప్రైవేటు సంస్థ అయిన మార్గదర్శి అక్రమంగా వందల కోట్ల రూపాయల డిపాజిట్లను తీసుకుంది. అదంతా అప్పు గానే పరిగణించాలి కదా? గతంలో 1800 కోట్ల నష్టాలలో  ఉన్నా డిపాజిట్ల సేకరణ ఆపలేదు కదా! మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ దీనిపై ఫిర్యాదు చేసిన తర్వాత కదా తన టీవీచానళ్లను అమ్మి దానినుంచి బయటపడింది.

అయినా మరోరూపంలో డిపాజిట్లు తీసుకుంటే అదేమో పారదర్శకమట. ప్రభుత్వం అదేమిటని అడిగితే కక్ష అట. ఇలా మాట్లాడే మేధావులంతా ప్రభుత్వం వద్దకు వచ్చేసరికి అమ్మో అప్పా? అంటూ గుండెలు బాదుకుంటూ నటిస్తుంటారు. శ్రీలంక, పాకిస్తాన్ వంటివాటితో ఈ రావుగారు పోల్చి మాట్లాడడం కూడా విడ్డూరమే. నిజంగానే ఏ రాష్ట్రం అయినా అలా సంక్షోభంలోకి వెళుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?పోనీ ఈ ప్రభుత్వం వివిధ స్కీముల కింద ఆర్దిక సాయం చేయడం తప్పు అని ఈ మేధావి భావిస్తే, మరి ఈ సంక్షేమ కార్యక్రమాల కన్నా మరింత అధికంగా అమలు చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు కదా!  

ఆయనను ఎందుకు విమర్శించడం లేదు. అంటే చంద్రబాబు 2019 నాటికి ప్రభుత్వంలో వంద కోట్లు మాత్రమే మిగిల్చి దిగిపోయినా, వీరి దృష్టిలో  ఆయన మంచి ఆర్దికవేత, విజనరీ.ఇప్పుడు జగన్ కన్నా అధికంగా స్కీములు ఇస్తామని చెబుతుంటే అప్పుడు మాత్రం రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్ ల లా గా మారదట.

ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరట. ఏపి వేరట. తెలంగాణ అప్పులపై ఈనాడు ఏనాడన్నా ఒక్క కథనాన్ని అయినా ఇచ్చిందా? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎందుకు ఈనాడు రామోజీ అంత భయపడుతున్నారు. అదే టైమ్ లో ఏపీలో  మాత్రం పనికట్టుకుని ఇలాంటి అప్పుల తప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారు. వెలుగు దినపత్రిక ఇచ్చిన ఒక కథనంలో తెలంగాణ ప్రభుత్వం 2.12 లక్షల కోట్ల అప్పును బడ్జెట్లో చూపకుండా చేసిందని తెలిపింది. ఈనాడులో ఎప్పుడైనా ఈ వార్తను ఇచ్చారా!

గతంలో ఈనాడు రాసింది కనుక, తెలుగుదేశం ఆరోపించింది కనుక జి.వి.రావు అనే  మేధావి కూడా ఏపిలో పది లక్షల కోట్ల అప్పు ఉందని చె్ప్పారని అర్థం అవుతూనే ఉంది. ఆయన దగ్గర అప్పులు సమాచారం ఉంటే ఆ క్లాసిఫికేషన్ ఇచ్చి ఉండేవారు కదా? ఈనాడులో వచ్చిన వార్తలనే మళ్లీ తాను కూడా చెప్పడానికి ఇంటర్వ్యూ ఎందుకు? ఏదో ఈనాడులో మేధావిగానో,నిపుణుడుగానో  ఉచిత ప్రచారం చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికి వస్తుంది ఈ ఇంటర్వ్యూ.

'గ్రామాలలో సచివాలయాలు ఏర్పాటు చేేస్తే అభివృద్ది కాదట. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పితే అది ప్రజలకు నష్టమట. స్కూళ్లకు వేల కోట్ల వ్యయం చేసి బాగు చేసి పేదలకు విద్యాబుద్దులు నేర్పడం మంచిది కాదట. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వరాదట... కేంద్రం నాలుగు లక్షల కోట్ల అప్పే ఏపీకి ఉందని చెప్పినా ఒప్పుకోరట. ఈనాడులో రాశారు కనుక మరో ఆరు లక్షల కోట్ల అప్పు అని చెప్పాల్సిందేనట."  ఆ మేధావి ఫీలింగ్స్ ఇలా ఉన్నాయనిపిస్తుంది. అందుకే ఏపీలో ఆయనకు అభివృద్ది కనిపించలేదుగతంలో ఎప్పుడూ రోజువారి అప్పులు చేయలేదా? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్  ఎందుకు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం 35 వేల  కోట్ల రుణాలకు అనుమతి ఇచ్చింది! అందుకూ ఈనాడు, జ్యోతి వంటి మీడియాలకు ఏడుపే.

కేంద్రంలో కొందరు అదికారులు ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అప్పుడు రాశారు. పోనీ ప్రభుత్వం ఈ స్కీములు అమలు చేయవద్దని రాస్తారా?అంటే అది రాయరు. ఇంకా అదనంగా ఇవ్వాలంటారు. వారికి కావల్సినప్పుడు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుందని రాస్తారు. ఇప్పుడు కూడా ఈ మేధావి ఎవరో జీవీ రావు గారు కూడా పది రూపాయలు ఇచ్చి పంద రూపాయలు తీసుకుంటే , ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు ఎందుకు వస్తాయో వివరించి ఉండాలి కదా? కేవలం తెలుగుదేశం కోసమో, ఈనాడు మీడియా కోసమో ఇలాంటి పిచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సోకాల్డ్ మేధావులు అప్రతిష్టపాలు కాకుండా ఉంటే మంచిది.

-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అ‍కాడమీ ఛైర్మన్

(చదవండి: మనది ఉద్యోగాంధ్ర.. ఉపాధి అవకాశాలు పుష్కలం.. దేశంలో 4వ స్థానం)

మరిన్ని వార్తలు