కోర్టు ఉత్తర్వులకూ తప్పుడు భాష్యం

16 Mar, 2024 03:54 IST|Sakshi

ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను వక్రీకరించి ప్రచురించిన ‘ఈనాడు’

సర్క్యులేషన్‌ వివరాలు సీల్డ్‌ కవర్లో ఇవ్వాలంటూ ఏబీసీకి కోర్టు నోటీసులు

ఈ నెల 27 వరకూ ఏ తెలుగు దినపత్రిక సర్క్యులేషన్‌నూ వెల్లడించవద్దని ఆదేశం

తెలుగు దినపత్రికలన్నిటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టంగా ఉత్తర్వులు

కానీ ‘సాక్షి’ వివరాలను మాత్రమే వెల్లడించవద్దన్నట్టుగా ‘ఈనాడు’ కథనం

‘ఈనాడు’ తప్పుడు కథనంపై నివ్వెరపోతున్నన్యాయ నిపుణులు

సాక్షి– అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ప్రతీ రోజూ తప్పుడు కథనాలు వండివారుస్తున్న ఈనాడు దినపత్రిక, తాజాగా కోర్టు ఉత్తర్వుల విషయంలోనూ అదే వైఖరిని బయటపెట్టుకుంది. కోర్టు ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్లు ప్రచురించి, ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. ‘సాక్షి’ దినపత్రిక సర్క్యులేషన్‌ వివరాలను వెల్లడించవద్దంటూ ఆడిట్‌బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ను (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా తప్పుడు కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

వాస్తవానికి సర్క్యులేషన్‌ వివరాలను తనకు సీల్డ్‌ కవర్లో సమర్పించాలని ఏబీసీని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు... ఈ నెల 27వరకూ ఏ తెలుగు దినపత్రిక సర్క్యులేషన్‌ వివరాలనూ వెల్లడి చేయవద్దని స్పష్టంగా తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ‘ఈనాడు’తో సహా తెలుగు దినపత్రికలన్నింటికీ వర్తిస్తాయి. కానీ ‘ఈనాడు’ మాత్రం... ఒక్క సాక్షి పత్రిక సర్క్యులేషన్‌ వివరాలను మాత్రమే వెల్లడించవద్దని ఏబీసీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లుగా కథనాన్ని ప్రచురించటంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీని వివరాలు చూస్తే...

విస్తృత సర్కులేషన్‌ ఉన్న ఏదైనా పత్రికను కొనుగోలు చేసుకోవటానికి గ్రామ, వార్డు వలంటీర్లకు, సచివాలయాలకు నెలకు రూ.200 ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. ఆ మేర బడ్జెట్‌ కేటాయింపులు కూడా చేసింది. ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా ఏ పత్రికను కొనాలన్నది చెప్పలేదు. విస్తృత సర్క్యులేషన్‌ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసుకోవచ్చునని వలంటీర్లకు ఛాయిస్‌ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

అలాగే వలంటీర్లు, సచివాలయాలు ఒకవేళ ‘సాక్షి’ దినపత్రికను కొనుగోలు చేస్తే ఆ సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్‌ బ్యూరో సర్కులేషన్‌ను (ఏబీసీ) ఆదేశించడంతో పాటు నిర్ధిష్ట కాలాల్లో సాక్షి పత్రికు ఇచ్చిన సర్కులేషన్‌ సర్టిఫికేషన్‌ను పునస్సమీక్ష చేయాలని కూడా ఏబీసీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్‌ ఐ.వెంకట్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక ప్రభుత్వ జీవోల అమలును నిలిపేయడంతో పాటు, 2022 జూలై– డిసెంబర్, ఆ తరువాత కాలానికి సాక్షి సర్కులేషన్‌ను ఆడిట్‌ చేయకుండా ఏబీసీని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు.

సీజే ధర్మాసనం మొదట ఈ అనుబంధ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. అటు ఈనాడు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నది. అనంతరం ఉషోదయ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేసింది. దీనిపై ఉషోదయ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత ఏడాది ఏప్రిల్‌ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉషోదయ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉషోదయ వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గత ఏడాది జూలై నుంచి విచారణ జరుపుతూ వస్తోంది.

ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక వాదనల సమర్పణకు సైతం ఆదేశాలిచ్చింది. అయితే సర్క్యులేషన్‌ వివరాలను వెల్లడి చేయకుండా ఏబీసీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని బుధవారం (మార్చి 13) ఉషోదయ మరో పిటిషన్‌ వేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏబీసీ తరఫు న్యాయవాది ఎవరూ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తాజా సర్కులేషన్‌ వివరాలను సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలంటూ ఏబీసీకి నోటీసులిచ్చింది.

అంతేకాక ఈ నెల 27 వరకూ తెలుగు దినపత్రికలన్నింటి సర్కులేషన్‌ వివరాలను వెల్లడి చేయవద్దని కూడా ఏబీసీని ఆదేశిస్తూ  విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ మన్‌మోహన్, న్యాయమూర్తి జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉంటే, ఈనాడు మాత్రం ఆ ఉత్తర్వులను దురుద్దేశాలతో తప్పుగా ప్రచురించింది. ఢిల్లీ హైకోర్టు ‘సాక్షి’ సర్కులేషన్‌ వివరాలను, గణాంకాలు ప్రచురించవద్దంటూ ఏబీసీని ఆదేశించినట్లు తప్పుడు కథనాన్ని ప్రచురించి తన నైజాన్ని చాటుకుంది. 

Election 2024

మరిన్ని వార్తలు