Sakshi News home page

ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం

Published Mon, Apr 8 2024 2:43 AM

226th State Level Bankers Committee Report Clarification - Sakshi

ఇందుకు బ్యాంకింగ్‌ రంగం కీలక సూచీలే నిదర్శనం 

ఐదేళ్లలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి 

డిపాజిట్లలో 58.23 శాతం వృద్ధి 

రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం వృద్ధి 

డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం ఉన్నతికి నిదర్శనం 

రుణాల పెరుగుదల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనం 

అర్హతగల వర్గాలందరికీ బ్యాంకుల ద్వారా రుణాలందించడంలో ప్రభుత్వం సఫలం 

ఆర్‌బీఐ నిబంధన మేరకు క్రెడిట్‌ డిపాజిట్‌ రేషియో 60 శాతం ఉండాలి 

కానీ రాష్ట్రంలో ఆ రేషియో 157.94 శాతం ఉంది 

226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక స్పష్టికరణ 

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్‌ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్‌ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం.

గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్‌ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్‌ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్‌ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్‌బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 

బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్‌ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది.

ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్‌ నాటికి  క్రెడిట్‌ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement