ఆక్వా, పాడి రైతులకు భరోసా  | Sakshi
Sakshi News home page

ఆక్వా, పాడి రైతులకు భరోసా 

Published Mon, Apr 8 2024 3:01 AM

loan of up to Rs 10 lakh per season to an aqua farmer: AP - Sakshi

అర్హత గల వారందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు 

ఆక్వా రైతుకు ప్రతి సీజన్‌లో రూ.10 లక్షల వరకు రుణం 

పాడి రైతుకు హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణ సదుపాయం 

ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్ల రుణాలు 

3 శాతం వరకు వడ్డీ రాయితీ 

సాక్షి, అమరావతి: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా పాడి, ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో ఆక్వా రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆరి్థక చేయూతనిస్తుండగా.. పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తోంది. కార్డుల జారీ, రుణ పరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్‌ ఆధారిత అప్లికేషన్‌ కూడా అభివృద్ధి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మరీ రుణాలు మంజూరు చేస్తోంది.

ముందెన్నడూ లేనివిధంగా ఐదేళ్లలో రూ.4,420.38 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. కార్డు పొందే పాడి రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించింది. తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 1.5 శాతం చొప్పున ఏటా  వడ్డీ రాయితీ పొందొచ్చు. సకాలంలో చెల్లించిన వారికైతే 3 శాతం వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా అందించింది.  

పాడి రైతులకు రూ.1,747.18 కోట్లు 
వైఎస్సార్‌ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడి పశువులు, సన్న జీవాలు కొనుగోలు చేసిన పాడి రైతులకు ప్రభుత్వం పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేసింది. జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద ఐదేళ్లలో 5.15 లక్షల మందికి మూగ, సన్నజీవాలను అందించింది. వీరందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేసింది. కార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు 1,38,392 మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా, వారిలో 1,13,399 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1,09,199 మందికి రూ.1.60 లక్షల వరకు రుణాలు ఇచి్చంది.

ఇలా రూ.1,747.18 కోట్ల రుణం అందించింది. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కేసీసీ కార్డులు జారీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసే పాడి రైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు, ఎంత పాడి ఉంది, ఎన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నారనే వివరాలను స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరిస్తే చాలు. ఎలాంటి హామీ లేకుండా  రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో పాడి రైతులు పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలు చేశారు.  

ఆక్వా రైతులకు రూ.2,673 కోట్లు 
ఐదేళ్లలో 19,059 మంది ఆక్వా రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కార్డులు పొందిన ఆక్వా రైతులకు ప్రతి సీజన్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఇందులో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తోంది. రూ.2 లక్షలపై 2 శాతం, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్‌ సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద మరో 3 శాతం వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించింది. ఇలా ఐదేళ్లలో రూ.2,673 కోట్లను రుణాలుగా ఇచ్చింది.

Advertisement
Advertisement