దివ్యాంగుల కోసం కోర్టుల్లో సౌకర్యాలు కల్పించాలి: హైకోర్టు

24 Mar, 2022 04:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో దివ్యాంగులైన న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం లిఫ్టులు, రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు, ఇతర వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వసతుల ఏర్పాటు బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తమ ముందున్న వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌లను ఆదేశించింది.

విచారణను ఏప్రిల్‌ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో దివ్యాంగులైన న్యాయవాదులకు, కక్షిదారులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాదులు జీఎల్‌వీ రమణమూర్తి, మరో ఏడుగురు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.  

మరిన్ని వార్తలు