గిరిజన మహిళా రైతుకు ‘ఫ్లేవర్‌ ఆఫ్‌ ఇండియా ది ఫైన్‌ కప్‌’

29 Sep, 2023 03:03 IST|Sakshi

సాక్షి, పాడేరు: బెంగళూరులో మూడు రోజుల పా­టు జరిగిన ప్రపంచ కాఫీ సదస్సు–2023లో నాణ్య­మైన కాఫీ గింజల ఉత్పత్తిలో అల్లూరి సీతారామ­రాజు జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతు కిల్లో అశ్విని అవార్డు పొందారు. అరాబిక్‌ పార్చ్‌మెంట్‌ కాఫీ గింజల విభాగంలోని అన్ని ఫార్మెట్లలో నాణ్య­మైన కాఫీ గింజలుగా అశ్విని పండించిన కాఫీ గింజలను జ్యూరీలోని అధికారుల బృందం గుర్తించింది.

దేశంలోని 10 రాష్ట్రాల పరి«ధిలో సాగైన కాఫీ గింజలను ప్రదర్శించారు. మన రాష్ట్రానికి సంబంధించి 124 మంది గిరిజన రైతులు పార్చ్‌మెంట్‌ కాఫీ గింజల శాంపిళ్లను ప్రదర్శించారు. వీటిలో పె­దబయలు మండలం కప్పాడ గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు అశ్విని పండించిన కాఫీ గింజ­లు నాణ్యతలో భారత్‌లోనే నంబర్‌ వన్‌గా నిలిచా­యని కాఫీ ప్రాజెక్ట్‌ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ‘ఫ్లేవర్‌ ఆఫ్‌ ఇండియా ది ఫైన్‌ కప్‌ అవార్డు­–2023’ అశ్వినిని వరించింది.

పలు దేశాలకు చెందిన ప్రతి­నిధులు, కేంద్ర కాఫీ బోర్డు ఉన్నతాధి­కా­రు­ల చేతు­ల మీదుగా ఆమె భర్త గాసన్న ఈ అవా­ర్డును అందుకున్నారు. కాఫీ గింజల ఉత్తమ నాణ్య­త అవార్డు రావడంపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్, కేంద్ర కాఫీ బోర్డు డీడీ రమేష్, ఐటీడీఏ కాఫీ ఏడీ అశోక్‌ హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు