ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి...

11 Nov, 2023 02:54 IST|Sakshi

రచిన్‌కు దిష్టి తీసిన అమ్మమ్మ 

సాక్షి, బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన కనబరుస్తున్న న్యూజిలాండ్‌ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర భారత సంతతికి చెందిన వాడని తెలిసిందే. రచిన్‌ కన్నడిగుడు. ఇప్పటికీ అతని మూలాలు బెంగళూరుతో ముడిపడే ఉన్నాయి. అందుకే శ్రీలంకతో మ్యాచ్‌ ముగియగానే రచిన్‌ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. తన మనవడు పుట్టింది విదేశంలో అయినా స్వదేశీ అలవాట్లు, సంప్రదాయాలు బాగా తెలిసిన పెద్దావిడ (అమ్మమ్మ) తన ఇంటికి రాగానే రచిన్‌ను సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

కివీస్‌లో స్థిరపడిన రచిన్‌ తల్లిదండ్రులు దీప, రవి కృష్ణమూర్తి బెంగళూరు వాసులు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన రవి వృత్తిరీత్యా 1990లో కివీస్‌కు వలస వెళ్లగా... 1999లో వెల్లింగ్టన్‌లో రచిన్‌ జన్మించాడు. రవి కృష్ణమూర్తికి క్రికెట్‌ అంటే ఇష్టం. భారత దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌లంటే అభిమానం. అందువల్లే తన కుమారుడికి వారిద్దరి పేర్లు కలిపి పెట్టారు. తనకిష్టమైన క్రికెట్‌లో బ్యాటర్‌ను చేశాడు. 

రచిన్‌కు ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు  
దుబాయ్‌: రచిన్‌ రవీంద్ర ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రచిన్‌ అత్యధిక పరుగులు (565) చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. లీగ్‌ దశలో మొత్తం 9 మ్యాచ్‌లాడిన ఈ కివీస్‌ ఓపెనర్‌ 3 శతకాలు, 2 అర్ధసెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరడంలో కీలక భూమిక పోషించాడు. ఈ నిలకడైన ప్రదర్శనే అతనికి ఐసీసీ అవార్డుకు ఎంపిక చేసింది.

రేసులో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డికాక్‌ (591), భారత సీమర్‌ బుమ్రా (15 వికెట్లు) ఉన్నప్పటికీ అవార్డు మాత్రం రచిన్‌నే వరించింది. 2021 జనవరి నుంచి ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డులు ఇస్తోంది. రచిన్‌కంటే ముందు న్యూజిలాండ్‌ నుంచి డెవాన్‌ కాన్వే (2021–జూన్‌), ఎజాజ్‌ పటేల్‌ (2021–డిసెంబర్‌) ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డులు గెల్చుకున్నారు.

మరిన్ని వార్తలు