ఫుడ్‌కోర్టుపై రాబంధులు.. ఒక్కో షాపు తెరిచేందుకు..

30 Aug, 2021 21:30 IST|Sakshi
నైట్‌ కోర్టు(ఫైల్‌ ఫోటో)

నైట్‌ ఫుడ్‌కోర్టులో కాసుల గలగల

అధికారికంగా 27 దుకాణాలకు మాత్రమే జీవీఎంసీ అనుమతి

తాజాగా 120 షాపుల ఏర్పాటుకు బేరసారాలు 

ఇప్పటికే కొందరు రూ. 50 లక్షలకు పైగా వసూలు చేసిన వైనం 

నైట్‌ ఫుడ్‌ కోర్టు తెరిచేందుకు నిరాకరిస్తున్న అధికారులు

‘మీరు నైట్‌ ఫుడ్‌ కోర్టులో షాప్‌ పెట్టుకుంటారా? అయితే లక్ష రూపాయలు మా చేతిలో పెట్టండి. మీ బండి మీకు నచ్చిన ప్లేస్‌లో పెట్టిస్తాం.’ కొంతమంది సాగిస్తున్న బేరసారాలివి. కార్పొరేషన్‌ సాక్షిగా దందా చేస్తూ.. నైట్‌ ఫుడ్‌ కోర్టు ప్రారంభించేందుకు వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నారు. వీరి వ్యవహారానికి జీవీఎంసీ సిబ్బంది కొందరు సహకారమందిస్తున్నారు.  

సాక్షి, విశాఖపట్నం: మహా నగర పరిధిలో స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్స్‌ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్‌ రోడ్డులో 27 ఫుడ్‌ స్టాల్స్‌తో నైట్‌ ఫుడ్‌ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్‌ బజార్‌ కూడా ఇందులో ప్రారంభించాలని భావించింది. కరోనా ప్రభావంతో 2020 మార్చి నుంచి వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో 24 గంటలూ బిజీ అయిపోయారు. లాక్‌డౌన్‌ క్రమక్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో నైట్‌ఫుడ్‌ కోర్టు తిరిగి తెరుచుకుంటుందని కొందరు ప్రచారానికి తెరతీశారు. దీంతో తాము ఫుడ్‌ కోర్టులో బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ కీలక వ్యక్తుల వెనుక షాపుల యజమానులు తిరగడం ప్రారంభించారు.  

27 స్టాళ్లకు అనుమతి.. 120 షాపులకు వసూళ్లు  
నైట్‌ ఫుడ్‌ కోర్టులో మొత్తం 27 స్టాళ్లకు మాత్రమే అధికారిక అనుమతులు ఇచ్చినా లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందు ఈ దుకాణాల సంఖ్య 138కి చేరుకుంది. ఏ ఒక్కరికీ అనుమతి లేకపోయినా.. అప్పట్లో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వంతో అవి నడిపించేశారు. ఇందులోనూ రెండు సంఘాలు ఏర్పడి.. వాళ్లు కూడా దందా సాగించేశారు. ఇప్పుడు మళ్లీ దుకాణాలు తెరిచేందుకు కొందరు బేరసారాలు మొదలు పెట్టేశారు. రెండు యూనియన్ల ద్వారా.. రాయబేరాలు నడుపుతూ పాతవారితో పాటు కొత్తగా వచ్చేవారికి కూడా స్టాల్‌ ప్లేస్‌ కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు వసూళ్లు ప్రారంభించేశారు.

ఒక స్టాల్‌ పెట్టడానికి అక్షరాలా రూ.లక్ష చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నైట్‌ ఫుడ్‌ కోర్టుకు మంచి డిమాండ్‌ ఉండటంతో ఇప్పటికే 50 మందికి పైగా డబ్బులు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. మరో 70 మంది వరకూ వీరితో బేరాలు ఆడుతున్నారని.. రూ.లక్షకు ఒక్క పైసా కూడా తగ్గేదేలే అని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ఈ వసూళ్లకు జీవీఎంసీ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. 

లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా ఎలా?
ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్స్‌ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కు పైగా దరఖాస్తులు వచ్చినా వారికి ఇవ్వకుండా అప్పటి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులకు దుకాణాలు కేటాయించేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ గతంలో కథనాలు రాయగా... ఫుడ్‌కోర్టు నుంచి స్టాల్స్‌ మొత్తాన్ని తొలగించేశారు. ఇప్పుడు మళ్లీ రచ్చ మొదలైంది.

దీనిపై జీవీఎంసీ అధికారులను సంప్రదించగా.. లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా నైట్‌ ఫుడ్‌ కోర్టు తెరిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కొందరు వసూళ్లకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మొత్తంగా ఫుడ్‌ కోర్ట్‌ ఏర్పాటు సదుద్దేశాన్ని పక్కదారి పట్టించి.. చిరు వ్యాపారులను మింగేసేందుకు వేస్తున్న స్కెచ్‌పై జీవీఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

చదవండి: ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలు: గోపాలకృష్ణ ద్వివేది

మరిన్ని వార్తలు