తాండవకు గోదారమ్మ 

16 Nov, 2020 03:29 IST|Sakshi

తాండవలో నీటి లభ్యత తగ్గడంతో ఆయకట్టుకు నీళ్లందని దుస్థితి 

ఏలేరు ఎడమ కాలువలో లోపాలతో సగం ఆయకట్టుకు కూడా నీళ్లందని వైనం 

ఏలేరు, తాండవ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం 

రెండు రిజర్వాయర్ల కింద 2,33,465 ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు  ప్రణాళిక 

కొత్తగా ఎత్తిపోతల పనులకు రూ.500 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు 

సాక్షి, అమరావతి: ఏలేరు, తాండవ రిజర్వాయర్ల ఆయకట్టును అనుసంధానం చేయడం ద్వారా 2,33,465 ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.500 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలను ఆర్ధిక శాఖకు జలవనరుల శాఖ పంపింది. ఆర్ధిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ అనంతరం పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ పరిపాలన అనుమతి ఇస్తుంది. ఈ రెండు రిజర్వాయర్ల ఆయకట్టు అనుసంధానం ద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదాకా విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేయడానికి మార్గం సుగమం అవుతుంది.  

విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం జీకే గూడెం వద్ద తాండవ నదిపై 4.96 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించి.. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 51,465 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల నదిలో నీటిలభ్యత తగ్గుతుండటంతో ఆయకట్టుకు ఇప్పటివరకు సరిగా నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. ఈ రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా రైతులను ఆదుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తాండవ ఆయకట్టు స్థిరీకరణతో పాటు ఏలేరు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 

ఒక ప్రతిపాదన.. బహుళ ప్రయోజనాలు 
► ఏలేరు రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 24.1 టీఎంసీలు. ఏలేరు పరీవాహక ప్రాంతంలో 17.92 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన అధికారులు ఎడమ కాలువ కింద 1.14 లక్షల ఎకరాలు, కుడి కాలువ కింద 10 వేల ఎకరాలకు నీళ్లు అందించేలా ప్రాజెక్టును రూపొందించారు. అయితే ఇప్పటివరకు ఏనాడూ పూర్తి ఆయకట్టుకు నీళ్లందించిన దాఖలాలు లేవు. ఎడమ కాలువ పనుల్లో లోపాల వల్ల దీనికింద 1.14 లక్షల ఎకరాలకు గాను కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందిస్తున్నారు. ఏలేరు రిజర్వాయర్‌ వద్ద ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యం వెయ్యి క్యూసెక్కులు. చివరకు వచ్చేసరికి 220 క్యూసెక్కులు ఉండేలా పనులు చేపట్టారు. కానీ కాలువను ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల 450 క్యూసెక్కులకు మించి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. కుడికాలువ పనులు పూర్తి కాలేదు. 

► ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఎడమ కాలువ వెడల్పు, లైనింగ్‌ పనులు చేపట్టి సరఫరా 1,250 క్యూసెక్కులకు పెంచేలా జలవనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తద్వారా కాలువ కింద పూర్తి ఆయకట్టు అంటే 1.14 లక్షల ఎకరాలకే కాకుండా కొత్తగా ఏడు వేల ఎకరాలకు వెరసి మొత్తం 1.21 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చునని, రోజుకు 250 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోయడం ద్వారా తాండవ ఆయకట్టు చివరి భూములకు కూడా నీళ్లందించవచ్చని, రెండు ప్రాజెక్టుల కింద ఆయకట్టు సస్యశ్యామలం చేయవచ్చునని అధికారులు తెలిపారు.  

► పోలవరం ఎడమ కాలువ నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలిస్తుండటం వల్ల రిజర్వాయర్‌కు నీటి లభ్యత సమస్య ఉండదు. దీనివల్ల ఏలేరు ఆయకట్టుకు, విశాఖపట్నం తాగు, పారిశ్రామిక అవసరాలకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేసేందుకు వీలవుతుంది. ఈ పనులు చేపట్టడానికి ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించాల్సిన అవసరం లేదు. రూ.500 కోట్లతో ఎత్తిపోతల పనులు పూర్తి చేయవచ్చునని అధికారులు ప్రతిపాదించారు. 

► ఈ అనుసంధానం పనుల వల్ల తాండవ ఆయకట్టుతో పాటు ఏలేరు ఆయకట్టుకూ పూర్తిస్థాయిలో నీటిని అందించవచ్చు. ఏలేరు కుడి కాలువను పూర్తి చేయడం ద్వారా పది వేల ఎకరాలకు నీళ్లందించవచ్చు. రిజర్వాయర్‌ దిగువన ఏలేరు పరివాహక ప్రాంతంలో 51 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. వర్షాకాలంలో ఖరీఫ్‌ పంటల సాగుకు ఇబ్బంది లేకున్నా, రబీకి ఇబ్బంది అవుతోంది. ఏలేరు రిజర్వాయర్‌ నుంచి ఆరు టీఎంసీలను నదిలోకి విడుదల చేయడం ద్వారా దిగువన ఉన్న 51 వేల ఎకరాలకు కూడా సమర్థవంతంగా నీటిని అందించవచ్చునని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు