ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

12 Dec, 2023 06:11 IST|Sakshi

జీతాలతోపాటు అలవెన్సుల చెల్లింపు

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్‌ టు’లో డ్యూటీ బేస్డ్‌ అలవెన్సులను జీతాలతోపాటు కలిపి చెల్లించనుంది.

ఈ మేరకు ఖజానా శాఖకు ఆదేశా­లు జారీ  అయ్యాయి. 2024 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభు­త్వం స్పష్టం చేసింది. వచ్చే నెల నైట్‌ అవుట్, డే అవుట్‌ అలవెన్సులు, ఓవర్‌ టైమ్‌ అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించనున్నారు. దాంతో దాదాపు 50వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నైట్‌ అవుట్, డే అవుట్, ఓటీ అలవెన్సులు విడిగా చెల్లిస్తున్నారు.

ఆ విధంగా కాకుండా విలీనానికి ముందు ఉన్నట్టుగానే జీతాలతోపాటు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్‌ఆర్‌బీఎస్‌ ట్రస్ట్‌­కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా త్వరలోనే దశలవారీగా చెల్లించాలని నిర్ణయించింది.  

పదోన్నతులకు త్వరలో మార్గదర్శకాలు 
ప్రభుత్వంలో విలీనానికి (2020 జనవరి 1కి) ముందు నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉ­న్న వారికి పదోన్నతుల కల్పనకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 1,026 మందికి పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలపై అప్పీల్‌ చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించా­ల­ని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభు­త్వా­న్ని కోరాయి.

ఆర్టీసీలో ఉద్యోగ నిర్వహణకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నిర్వహ­ణకు ఉన్న వ్యత్యాసాలను పరిగణలోకి తీసు­కోవాలని విన్నవించారు. ఇతర ప్రభు­త్వ ఉద్యోగుల మాదిరిగా క్రమశిక్షణ చర్య­లు అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ ఉద్యోగులు అప్పీల్‌ చేసేందుకు.. తదనంతరం సత్వరం పరిష్కరించేలా విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై రూపొందించిన ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. త్వరలోనే క్రమశిక్షణ చర్యలపై ప్రత్యేకంగా అప్పీళ్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు 
ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలతోపాటు అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ఈ నిర్ణ­యంతో ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగుల డిమాండ్ల పట్ల సా­నుకూలంగా స్పందించినందుకు ప్రభు­త్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. – పల్లిశెట్టి దామోదరరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్‌ యూనియన్‌

 ఉద్యోగులకు ప్రయోజనకరం 
 ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై సాను కూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డ్యూటీబేస్డ్‌ అలవెన్సులను ప్రతి నెల జీతాలతోపాటు చెల్లించడం ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – పీవీ రమణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వై.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ 

>
మరిన్ని వార్తలు