పారిశ్రామిక సమస్యల పరిష్కారంపై దృష్టి

3 Jun, 2022 06:07 IST|Sakshi

పరిశ్రమ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు

జిల్లాకొక సంబంధాల అధికారి నియామకం

పెట్టుబడుల ఆకర్షణకు 50 జాతీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు 

పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం కోసం త్వరలోనే రంగాల వారీగా రౌండ్‌ టేబుల్‌ సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. గురువారం ఏపీఐఐసీలోని మంత్రి కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.  

దావోస్‌ పర్యటనలో వచ్చిన పెట్టుబడులు, వాటి తదనంతరం శాఖాపరమైన కొనసాగింపు చర్యలపై మంత్రి అమర్నాథ్‌ దిశానిర్దేశం చేశారు. ప్రధాన పారిశ్రామికవేత్తలు, సంఘాలతో రంగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సమస్యల పరిష్కారం,  పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా వాస్తవరూపం దాల్చడానికి జిల్లాకొక పరిశ్రమల సంబంధాల అధికారిని నియమించాలని చెప్పారు.

దావోస్‌లో కలిసిన ప్రతినిధులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆహ్వానిస్తూ పది రోజుల్లోగా లేఖలను రాయాలని ఈడీబీ అధికారులకు తెలిపారు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకుని వివిధ కారణాలతో మధ్యలో ఆగిపోయిన వారితో సంప్రదింపులు జరపాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. అదే

విధంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 40, అంతర్జాతీయంగా 10 రోడ్‌షోలను నిర్వహించే విధంగా తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు. ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు ఏవీ పటేల్, జాయింట్‌ డైరెక్టర్లు ఇందిరా దేవి,  వీఆర్‌ నాయక్, ఈడీబీ ప్రతినిధులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు