అమరావతి సభను ప్రశాంతంగా జరపండి

17 Dec, 2020 04:33 IST|Sakshi

నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులదే బాధ్యత 

అల్లర్లకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు 

గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ వెల్లడి 

గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సభ నిర్వహణకు అనుమతులు ఇచ్చామని గుంటూరు రేంజ్‌ డీఐజీ సీఎం త్రివిక్రమ వర్మ చెప్పారు. సభను అల్లర్లకు దూరంగా.. ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన పూర్తి బాధ్యతను నిర్వాహకులే వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. శాంతియుతంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను రాజ్యంగం భారత పౌరులకు ఇచ్చిందని.. ఇతరులకు అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభకు పోలీస్‌ శాఖ నుంచి అన్ని సహకారాలు ఉంటాయన్నారు. అయితే, ఉద్దేశపూర్వకంగా కొందరు అల్లర్లు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తమకు ముందస్తు సమాచారం అందిందన్నారు.

ఈ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు. అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విధిగా ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సభలో పాల్గొనాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే సభ, ర్యాలీ కార్యక్రమాలను అనుమతిస్తామన్నారు. ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. కరకట్టపై ముఖ్య అధికారులు, జడ్జిలు, అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలకు అనుమతి ఉంటుదన్నారు. ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మందిని సమీకరించకుండా జాగ్రత్తలు పాటించేలా నిర్వహకులకు అనుమతులు ఇచ్చామన్నారు. 

మరిన్ని వార్తలు