విద్యపై ఖర్చు రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడి 

6 Sep, 2023 05:09 IST|Sakshi

విద్యాశాఖ మంత్రి బొత్స 

విశాఖలో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం 

సాక్షి, విశాఖపట్నం: విద్యపై చేస్తున్న ఖర్చు మన రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ కుటుంబ సభ్యులేననీ, ప్రతి ఉద్యోగి ప్రభుత్వంలో అంతర్భాగమేనని వారిపై పనిఒత్తిడి తగ్గించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ ఆలోచిస్తుంటారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..  

విశ్వవిద్యాలయాల్లో 3,200 పోస్టుల భర్తీ 
రాష్ట్రంలో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? కేవలం సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యమయ్యాయి. 7 లేదా 8 తేదీల్లో జీతాలు జమచేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ‘నో అడ్మిషన్‌’ బోర్డులు పెడుతున్నాం. అదేవిధంగా.. ఇటీవల టెన్త్‌ ఫలితాల్లో ఎక్కువ స్టేట్‌ ర్యాంకులు గవర్నమెంట్‌ స్కూల్స్‌లో చదివే విద్యార్థులే దక్కించుకున్నారు. వీటన్నింటికీ కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇక విద్య మీద ఖర్చుచేసే ప్రతి రూపాయి రాష్ట్రం మీద పెట్టు­బడిగా ప్రభుత్వం భావిస్తోంది. గత 15 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాల్లేవు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం 3,200 పోస్టులు భర్తీని డిసెంబర్‌ నెలాఖరుకల్లా పూర్తిచేస్తాం. 

ఉపాధ్యాయులందరికీ న్యాయం జరుగుతుంది.. 
మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు విశాఖకు విడదీయలేని అనుబంధం ఉంది. సీఎం జగన్‌ న్యాయం చేయలేకపోతే ఉపాధ్యాయులకు మరెవ్వరూ మేలు చేయలేరు. ఒక రోజు అటు ఇటుగా అందరికీ న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ‘విద్యావ్యవస్థలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి పాఠశాలలను మెరుగుపరచేందుకు అనేక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది’ అన్నారు.   

‘ప్రపంచ జ్ఞానం నేర్పే గురువులకు కృతజ్ఞతాభివందనాలు’ 
‘బిడ్డ గొప్పగా ఎదిగితే.. ఆ బిడ్డ తల్లిదండ్రుల ఆనందం.. ఆకాశాన్నంటుతుంది. వందలు.. వేల పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే ప్రతి టీచర్‌కు లభించే సంతోషం, సంతృప్తి ఇంకెంత గొప్పదో మాటల్లో చెప్పలేం. శిక్షణ, క్రమశిక్షణ.. పాఠాలు, జీవిత పాఠాలు.. అక్షరజ్ఞానం, ఆలోచనలు.. ప్రపంచ జ్ఞానం అన్నీ నేర్పే గురుబ్రహ్మలకు, మేథోశక్తులకు ఆదర్శప్రాయులైన మంచి టీచర్లకు, రాష్ట్రం తరఫున కృతజ్ఞతాభివందనాలు. (విదేశీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ సందేశాన్ని  సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ బి. శ్రీనివాసరావు చదివి వినిపించారు.) 

రాష్ట్రపతి, ప్రధాని సందేశాలు 
ఇక గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర­పతి ద్రౌపతిముర్ము సందేశాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి... ప్రధాని మోదీ సందేశాన్ని పాఠశాల విద్యా­శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ చదివి వినిపించారు.  అనంతరంరాష్ట్రవ్యాప్తంగా 11 కేటగిరీల్లో 196 మందికి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవార్డులందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఎంపీ డా.భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎస్‌. సురేష్ కుమార్, ఏయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రసాదరెడ్డి, విశాఖ మేయర్‌ జీహెచ్‌వీ కుమారి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నాగరాణి, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు