లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు 

14 Sep, 2021 03:42 IST|Sakshi

‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో ప్రభుత్వమే ఇళ్లు కట్టించే ఆప్షన్‌–3 ఎంచుకున్న 3.25 లక్షల మంది లబ్ధిదారులు 

ఒక్కో గ్రూపులో 10 నుంచి 20 మంది ఉండేలా చర్యలు 

ఇప్పటివరకు 1.77 లక్షల మందితో 12,855 గ్రూపుల ఏర్పాటు 

నెలాఖరులోగా గ్రూపుల్ని పూర్తి చేసేందుకు గృహ నిర్మాణ శాఖ కసరత్తు 

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్‌–3ని ఎంచుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్‌ 25న వీటి నిర్మాణాలను ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిర్దేశించిన గడువులోగా పనులు ప్రారంభించేలా కసరత్తు మొదలైంది. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్‌–3ని రాష్ట్రవ్యాప్తంగా 3,25,899 మంది లబ్ధిదారులు ఎంచుకున్నారు. వీరందరినీ గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

12,855 గ్రూపుల ఏర్పాటు
ఆప్షన్‌–3ని ఎంచుకున్న లబ్ధిదారుల్లో 10 నుంచి 20 మందిని ఒక్కొక్క గ్రూపుగా గృహ నిర్మాణ శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,77,421 మందితో 12,855 గ్రూపులను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లాలో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ నూరు శాతం పూర్తయింది. ఈ జిల్లాలో 12,632 మంది లబ్ధిదారులు ఉండగా.. 1,087 గ్రూపులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిలో 92%, కర్నూలు జిల్లాలో 78 %గ్రూపుల ఏర్పాటు పూర్తయింది. అత్యల్పంగా విజయనగరంలో 14% మాత్రమే గ్రూపుల ఏర్పాటు జరిగింది.

తగ్గనున్న నిర్మాణ వ్యయం
లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన గ్రూపులను స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కాంట్రాక్టర్‌లను గుర్తించి అనుసంధానిస్తున్నారు.  ఈ విధానం వల్ల గ్రూప్‌లో ఉన్న లబ్ధిదారుల ఇళ్లన్నింటికీ ఒకే నిర్మాణ ధర వర్తిస్తుంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఈ నెలాఖరు నాటికి స్థానికంగా కాంట్రాక్టర్‌ల గుర్తింపు, గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

వేగంగా గ్రూపుల ఏర్పాటు
ఆప్షన్‌–3 ఎంచుకున్న లబ్ధిదారుల గ్రూపుల ఏర్పాటు ప్రక్రియను వేగంగా చేపడుతున్నాం. ఈ నెలాఖరులోగా గ్రూపుల ఏర్పాటు పూర్తికి కృషి చేస్తున్నాం. వచ్చే నెల 25 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నాం.    
– నారాయణ భరత్‌గుప్తా, ఎండీ, హౌసింగ్‌ కార్పొరేషన్‌

మరిన్ని వార్తలు