కరువు సీమలో.. ‘కొప్పర్తి’ కాంతులు

31 Aug, 2021 01:54 IST|Sakshi
కొప్పర్తి పారిశ్రామిక పార్కులో సిద్ధమైన అంతర్గత రహదారులు

రికార్డు వేగంతో సిద్ధమైన భారీ పారిశ్రామిక పార్కు

దసరా నాటికి ప్రారంభించేలా ఏపీఐఐసీ కసరత్తు

శరవేగంగా జరుగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులు

కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో నాలుగు పారిశ్రామిక పార్కుల అభివృద్ధి

3,164 ఎకరాల్లో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌

801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌

104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు 

నిక్‌డిట్‌ నిధులతో మరో 2,596 ఎకరాల అభివృద్ధి

ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక రాయితీలతో కంపెనీల ‘క్యూ’

ఉద్యోగుల నివాసాలకు రూ.1,500 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ సిటీ 

రూ.60,200 కోట్ల పెట్టుబడుల అంచనా సుమారు 6 లక్షల మందికి ఉపాధి

కొప్పర్తి నుంచి సాక్షి, ప్రతినిధి చంద్రశేఖర్‌ మైలవరపు: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి రూపు రేఖలను మార్చే మరో భారీ పారిశ్రామిక పార్కు శరవేగంగా అందుబాటులోకి వస్తోంది. శంకుస్థాపనలు, ఎంవోయూలు అంటూ ఆర్భాటాలు, హడావుడి లేకుండా నేరుగా కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించే విధంగా వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో భారీ పారిశ్రామిక పార్కును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఒకపక్క కోవిడ్‌ సంక్షోభం ఉన్నప్పటికీ కేవలం 9 నెలల్లోనే యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రభుత్వ చొరవతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కడప నగరానికి కూతవేటు దూరంలో సుమారు 6,914 ఎకరాల్లో ఏకకాలంలో నాలుగు పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిట్‌) నిధులతో 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనుండగా మిగిలిన 4,318 ఎకరాల్లో ఏపీఐఐసీ మూడు పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది.

3,164 ఎకరాల్లో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్, 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఈఎంసీ, 104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులుగా ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ మూడు పార్కులకు విద్యుత్‌ సరఫరా కోసం ప్రత్యేకంగా 132 కేవీ సబ్‌స్టేషన్, రహదారులు, మురుగునీటి కాలువలు లాంటి మౌలిక వసతులను ఏపీఐఐసీ అభివృద్ధి చేయడంతో పలు సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. మిగతా 249 ఎకరాల భూమిని ఇతర పారిశ్రామిక ఎకరాలకు వినియోగించనున్నారు. దసరా నాటికి కొప్పర్తి పారిశ్రామిక పార్కులో ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 6,914 ఎకరాలు అందుబాటులోకి వస్తే కొప్పర్తిలో సుమారు రూ.60,200 కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

క్యూ కడుతున్న కంపెనీలు
బాగా వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్‌ కడప జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొప్పర్తిలో పారిశ్రామిక పార్కును ప్రతిపాదించారు. ఆయన హఠాన్మరణం అనంతరం ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే కొప్పర్తి పారిశ్రామిక పార్కుపై దృష్టి సారించారు. ఒకపక్క మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే మరోపక్క పెట్టుబడులను ఆకర్షించేలా కొప్పర్తిలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలు కల్పించారు. దీంతో పలు సంస్థలు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే 47 కంపెనీలకు 430 ఎకరాలను కేటాయించారు. ఇందులో నాలుగు భారీ యూనిట్లు ఉండగా మిగిలిన 43 ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందినవి. 47 యూనిట్ల ద్వారా రూ.1,837 కోట్ల మేర పెట్టుబడులు, 8,941 ఉద్యోగాలు రానున్నాయి. వైఎస్సార్‌ ఈఎంసీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు భారీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.
ముఖ ద్వారం నమూనా 

కొప్పర్తికి కలిసొచ్చే అంశాలివే..
రోడ్లు, రైలు మార్గం, విమానాశ్రయం, పోర్టు.. ఇలా అన్ని ప్రధాన రవాణా మార్గాలు ఉండటం కొప్పర్తి పారిశ్రామిక పార్కులో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారి 40గా వ్యవహరించే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ హైవేకి ఆనుకొని కడప–పులివెందుల రహదారికి ఇరువైపులా కొప్పర్తి పారిశ్రామికపార్కు విస్తరించి ఉంది. కేవలం పది కిలోమీటర్ల లోపే కడప విమానాశ్రయం ఉంది. ఈ పారిశ్రామిక పార్కు గుండా కడప–బెంగళూరు రైల్వేలైన్‌ ఉంది. 200 కి.మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు, 270 కి.మీ దూరంలో చెన్నై పోర్టు ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీటన్నిటికంటే వైఎస్సార్‌ కడప జిల్లాలో బెరైటీస్, ఐరన్‌ ఓర్, క్వారŠజ్ట్, వైట్‌ క్లే లాంటి అనేక ఖనిజాలు లభ్యం కావడం కూడా వీటి ఆథారిత యూనిట్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది.  

2011 లెక్కల ప్రకారం వైఎస్సార్‌ కడప జిల్లా జనాభా 28,82,469 కాగా 9 పాలిటెక్నిక్‌ కాలేజీలు, 24 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 49 డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు  పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం అదనపు ఆకర్షణ. ఇక్కడ నెలకొల్పే యూనిట్లకు గండికోట రిజర్వాయర్‌ నుంచి శాశ్వత ప్రాతిపదికన ఒక టీఎంసీ నీటిని తరలించేలా ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలుత సోమశిల రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించినా పెన్సుల నరసింహస్వామి అభయారణ్యం ద్వారా పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో అనుమతుల్లో జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో గండికోట నుంచి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏడాదిలోగా శాశ్వత నీటి వసతి కల్పించే విధంగా ఏపీఐఐసీ చర్యలు తీసుకుంటోంది. కొప్పర్తి సమీపంలోనే పాపాగ్ని, పెన్నా నదులు ఉండటంతో భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండదు.
వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌ మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా కంపెనీ 

వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్‌తో 2.5 లక్షల మందికి ఉపాధి
వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో 3,164 ఎకరాలను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ పార్కు ద్వారా కనీసం రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక్కడ నెలకొల్పే యూనిట్లకు ప్రత్యేక రాయితీలతో పాటు తొలి ఐదు యాంకర్‌ కంపెనీలకు మరిన్ని అదనపు రాయితీలను అందిస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో ఇన్వెస్ట్‌ చేసే తొలి ఐదు కంపెనీలు లేదా యాంకర్‌ యూనిట్లకు తక్కువ ధరకే భూమి కేటాయింపు, స్టాంపు డ్యూటీ, ఎస్‌జీఎస్టీ పూర్తి మినహాయింపుతో పాటు వడ్డీ, విద్యుత్‌ సబ్సిడీ లాంటి అనేక రాయితీలు కల్పిస్తున్నారు. 

రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను కేటాయించారు. ఈ యూనిట్‌ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. రూ.486 కోట్ల పెట్టుబడితో 2,030 మందికి ఉపాధి కల్పించడానికి ముందుకొచ్చిన ప్రముఖ ఫర్నిచర్‌ తయారీ సంస్థ నీల్‌ కమల్‌కు 105 ఎకరాలను కేటాయించారు. బల్క్‌డ్రగ్స్, మెట్రోరైల్‌ విడిభాగాలు తయారీ, సిమెంట్‌ పైపుల నిర్మాణం, స్టేషనరీ లాంటి అనేక యూనిట్లకు ఇప్పటికే భూములు కేటాయించారు. ఇందులో చాలావరకు ఎస్సీ, ఎస్టీ మహిళలకు చెందిన యూనిట్లు ఉండటం గమనార్హం.
వైఎస్సార్‌ ఈఎంసీలో నిర్మించిన ఫ్యాక్టరీ షెడ్లు 

రూ.748 కోట్లతో వైఎస్సార్‌ ఈఎంసీ
కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రకటించిన ఎలక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)–2 పథకంలో భాగంగా దేశంలో అనుమతులు పొందిన తొలి ప్రాజెక్టు వైఎస్సార్‌ ఈఎంసీ. మొత్తం 801 ఎకరాల్లో విస్తరించిన వైఎస్సార్‌ ఈఎంసీలో తొలిదశలో రూ.748 కోట్లతో 540 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో యూనిట్లు తక్షణం ఉత్పత్తి ప్రారంభించే విధంగా ఒకొక్కటి 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం నాలుగు రెడీ టు బిల్డ్‌ షెడ్లు సిద్ధమయ్యాయి. ఇందులో రెండు షెడ్లను డిక్సన్‌ కంపెనీకి, రెండు షెడ్లను కార్బన్‌ మొబైల్స్‌కు కేటాయించనున్నారు. ఇవేకాకుండా సోలార్‌ పీవీ మాడ్యూల్స్, ఈవీ బ్యాటరీస్, మొబైల్‌ ఫోన్‌ ప్యానల్స్, ఏసీలు, వాషింగ్‌మెషీన్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఎంఎస్‌ఎంఈ పార్కు
సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా 104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఎంఎస్‌ఈ–సీడీపీ కింద రూ.14 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 98 ప్లాట్స్‌ను అభివృద్ధి చేసి యూనిట్లకు కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా రూ.200 కోట్ల విలువైన పెట్టుబడులు, 3,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 

నిక్‌డిక్ట్‌ నిధులతో పారిశ్రామిక పార్కు
కొప్పర్తి సౌత్‌ నోడ్‌లో 2,595.74 ఎకరాల్లో నిక్‌డిట్‌ నిధులతో భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి మాస్టర్‌ పాŠల్న్‌ సిద్ధమైంది. ఆమోదం కోసం దీన్ని నిక్‌డిట్‌కు సమర్పించారు. మాస్టర్‌ప్లాన్‌ ఆమోదం తర్వాత కొప్పర్తి సౌత్‌ నోడ్‌ పనులు ప్రారంభమవుతాయి. ఈ పార్కు ద్వారా సుమారు రూ.25,000 కోట్ల పెట్టుబడులు, రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రాధమికంగా అంచనా వేశారు.

250 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ సిటీ..
కొప్పర్తిలో పనిచేసే అన్ని తరగతుల ఉద్యోగులు అక్కడే నివాసం ఉండే విధంగా అన్ని వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ సిటీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డార్మెటరీల దగ్గర నుంచి లగ్జరీ అపార్ట్‌మెంట్ల వరకు అన్ని తరగతులు వారు నివసించేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు ఆస్పత్రులు, మాల్స్, స్కూల్స్, 3 స్టార్‌ నుంచి 5 స్టార్‌ దాకా హోటళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. సుమారు 250 ఎకరాల్లో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేడ్‌ సిటీ అభివృద్ధికి పలు సంస్థల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. పారిశ్రామిక పార్కును ప్రారంభించే రోజే సీఎం చేతుల మీదుగా ఇంటిగ్రేటెడ్‌ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

లక్షల మందికి ఉపాధి ...
పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించి కొప్పర్తి పారిశ్రామికవాడను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టగా మరికొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. గత సర్కారు మాదిరిగా హంగులు, ఆర్భాటాలు లేకుండా భారీ పారిశ్రామిక పార్కును సిద్ధం చేస్తున్నాం. లక్షల మందికి ఉపాధి కల్పించే శక్తి కొప్పర్తికి ఉంది. రానున్న రోజుల్లో కొప్పర్తి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయనడంలో సందేహం లేదు.
– మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

నిర్వహణ వ్యయం చాలా తక్కువ..
ఇక్కడ ఏర్పాటయ్యే యూనిట్ల నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండేలా వైఎస్సార్‌ ఈఎంసీని అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈఎంసీలో యూనిట్‌ రూ.4.50కే విద్యుత్‌ అందిస్తున్నాం. ఈ ధరకే నేరుగా బిల్లింగ్‌ చేయడం వల్ల ప్రతి యూనిట్‌కు నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది. తక్కువ ధరకే భూమి, నీటిని కూడా అందించడం కలిసొచ్చే అంశం. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉన్నప్పటికీ తుది అనుమతులు పొందిన నాలుగు నెలల్లోనే ఈఎంసీని అందుబాటులోకి తెచ్చాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
– నందకిషోర్, సీఈవో, వైఎస్సార్‌ ఈఎంసీ

సొంత ప్రాంతంలో యూనిట్‌
గత 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫార్మా కంపెనీల్లో పనిచేశా. ఆ అనుభవంతో సొంతంగా బల్క్‌ డ్రగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలనుకున్నా. తెలంగాణాలో ఎకరం భూమి రూ.50 లక్షల నుంచి 70 లక్షలు పెడితే కానీ దొరికే అవకాశం లేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొప్పర్తిలో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేస్తుండటం, ఇది మా సొంత ప్రాంతం కావడంతో ఇక్కడ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించా. తొలిదశలో రూ.6 కోట్లతో బీఎస్‌ ల్యాబ్‌రేటరీస్‌ పేరుతో బల్క్‌ డ్రగ్‌ ఫార్మాను ఏర్పాటు చేశా. ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో కేవలం ఆరునెలల్లోనే యూనిట్‌ ఉత్పత్తికి సిద్ధమైంది. ఈ యూనిట్‌ ద్వారా కనీసం 150 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది.
–బి.శ్రీనివాసులురెడ్డి, బీఎస్‌ ల్యాబ్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌

సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌
స్వర్ణముఖి కాంక్రీట్స్‌ పేరుతో కొప్పర్తిలో 2 ఎకరాల్లో సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నా. ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.6 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 25 మందికి ఉపాధి లభించనుంది. రెండేళ్లలోనే కొప్పర్తి పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందింది.
– ఎన్‌.మహేందర్‌రెడ్డి, ఎండీ, స్వర్ణముఖి కాంక్రీట్స్‌  

మరిన్ని వార్తలు