రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

14 Sep, 2020 03:56 IST|Sakshi
వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నానది

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొన్నిచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకలు, చెక్‌ డ్యాంలు పొంగిప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. 
► బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. పి.గన్నవరం మండలంలో అత్యధికంగా 17.42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. 
► అనంతపురం జిల్లాలో కురిసిన వర్షానికి 61 మండలాల పరిధిలో 2.82 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. 
► వైఎస్సార్‌ జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో 3.72 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలోని 57 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో అక్కడక్కడా వర్షం పడింది. గుంటూరు జిల్లాలో చిరు జల్లులు కురిశాయి. 

నీటమునిగిన పంట పొలాలు
విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో సుమారు 100 ఎకరాల్లో వరి పూర్తిగా నీటమునిగింది. వైఎస్సార్‌ జిల్లాలో 412 హెక్టార్లలో వరి, వేరుశనగ, పత్తి, సజ్జ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. అనంతలో వందల హెక్టార్లలో దెబ్బతిన్నట్లు నివేదిక తయారు చేశారు. కర్నూలు జిల్లాలో పలుచోట్ల మొక్కజొన్న, వరి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పు గోదావరిలోనూ వాగు వెంబడి ఉన్న పంట పొలాలన్నీ నీట మునిగాయి.

పిడుగు పడి ఇద్దరు కూలీల దుర్మరణం..
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో పిడుగు పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ప్రహరీ కూలి 75 గొర్రెలు, 3 మేకలు, 20 గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. 

మరిన్ని వార్తలు