డీజీపీని కలిసిన వల్లభనేని వంశీ.. టీడీపీ నేతలకు వార్నింగ్

2 Dec, 2022 13:38 IST|Sakshi
డీజీపీకి వినతిపత్రమిస్తున్న వల్లభనేని వంశీ

సాక్షి, విజయవాడ: సంకల్ప సిద్ధి ఈ కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్కాంలో తనకు ప్రమేయం ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు, పచ్చ మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ డీజీపీని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సంకల్ప సిద్ధి స్కాంలో ఓలుపల్లి రంగా ద్వారా నాకు, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి సంబంధం ఉందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రెస్‌మీట్‌లో చెప్పారు. 3 నెలలుగా నేను గన్నవరంలో ఉండటంలేదని, హైదరాబాద్‌లో ఉంటూ రూ.600 కోట్లతో బెంగళూరులో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు కట్టానంటూ నిరాధార ఆరోపణలు చేశారు.

చదవండి: (రాయలసీమ ప్రగతికి మరో ‘హైవే’.. రూ.1,500.11 కోట్లతో 4లేన్ల రహదారి) 

ఈ స్కాంలో వందల కోట్లు సంపాదించానంటూ పుకార్లు పుట్టించారు. ఈ అసత్య ప్రచారాన్ని టీవీ 5, ఏబీఎన్‌ ఛానళ్లు గత నెల 26, 27 తేదీల్లో లైవ్‌ టెలికాస్ట్‌గా, 27, 28 తేదీల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలుగా ఇచ్చాయి. గతంలోనూ గల్ఫ్‌లో కాసినోలు పెట్టించానని, చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలున్నాయని టీడీపీ నేతలు ప్రచారం చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించాలని విఫలయత్నం చేశారు. చీకోటి ప్రవీణ్‌ వ్యవహారంలో నాకు, కొడాలి నానికి ఎలాంటి ప్రమేయం లేదని ఈడీ తేల్చిన తరువాత తోక ముడిచారు.

సంకల్ప స్కాంలో నాపై చేసిన ఆరోపణలకు వారి వద్ద ఉన్న ఆధారాలు వెంటనే బయటపెట్టాలి’ అని డిమాండ్‌ చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మించేందుకు పచ్చ మీడియా పని చేస్తోందన్నారు. ఈ కేసులో తన అనుచరులు ఉంటే అరెస్ట్‌ చేయాలని, సీబీఐ, స్వతంత్ర సంస్థలతో విచారించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన టీవీ5, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు