పోలవరంతో భద్రాద్రి భద్రమే

3 Oct, 2022 03:41 IST|Sakshi

ప్రాజెక్టుతో ముంపు ముప్పు లేదన్న ఐఐటీ హైదరాబాద్‌

పోలవరం ప్రాజెక్టు కట్టాక భద్రాచలం వద్ద పెరిగే మట్టం 2 సెంటీమీటర్లే

గోదారికి పది వేల ఏళ్లకు ఒకసారి 44.61 లక్షల క్యూసెక్కుల వరద 

50 లక్షల క్యూసెక్కులు వచ్చినా సులభంగా వదిలేలా పోలవరం స్పిల్‌వే 

గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్‌ వాటర్‌ ప్రభావమే ఉండదు

ముందు జాగ్రత్తగా 124.55 కి.మీ. పొడవున గోదావరికి కరకట్టలు నిర్మించాలని సూచన

పోలవరం గరిష్ట వరద, బ్యాక్‌ వాటర్‌పై ఐఐటీ–హైదరాబాద్‌తో తెలంగాణ సర్కార్‌ అధ్యయనం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ఎలాంటి ముంపు ముప్పు ఉండదని ఐఐటీ–హైదరాబాద్‌ తేల్చి చెప్పింది. పోలవరాన్ని కట్టాక భద్రాచలం వద్ద పెరిగే గోదావరి నీటి మట్టం కేవలం గోరంతేనని (2 సెంటీమీటర్లు) స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాను స్వయంగా చేయించిన ఈ అధ్యయనంలోనే  పోలవరం ద్వారా భద్రాచలానికి ఏ మాత్రం ముప్పు లేదని స్పష్టం కావడం గమనార్హం. వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేలా పోలవరం గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్‌ వాటర్‌ ప్రభావం భద్రాచలం సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలపై ఏమాత్రం ఉండదని తెలిపింది.

పోలవరం వద్ద గోదావరి గరిష్ట వరద, బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై తెలంగాణ నీటిపారుదల శాఖ 2017లో ఐఐటీ–హైదరాబాద్‌తో అధ్యయనం నిర్వహించింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో సీడబ్ల్యూసీ, తెలంగాణ జలవనరుల విభాగం లెక్కల ప్రకారం వరద ప్రవాహాలు, ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ నమోదు చేసిన వరద ప్రవాహాలను అధ్యయనం చేసేందుకు ఐఐటీ–హైదరాబాద్‌కు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. 

ముంపు ముప్పు ఉత్తదే..
ధవళేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నమోదు చేసిన రికార్డులు కచ్చితంగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకుని పోలవరం వద్ద వెయ్యేళ్లకు, పది వేల ఏళ్లకు ఒకసారి గరిష్టంగా వచ్చే వరదను లెక్కట్టిన ఐఐటీ–హైదరాబాద్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలివీ..

► పోలవరంలో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తే 637 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ముంపునకు గురవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 601, ఒడిశాలో 12, చత్తీస్‌గఢ్‌లో 24 చ.కి.మీ. భూభాగం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతుండగా చత్తీస్‌గఢ్‌లో పది, ఒడిశాలో ఏడు రెవెన్యూ గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుంది.

► గోదావరిలో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57 మీటర్లు ఉంటే.. కట్టాక 57.02 మీటర్లు మాత్రమే ఉంటుంది.

► గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. 

► గోదావరి గరిష్ట వరద ప్రవాహాలను పరిగణలోకి తీసుకుంటే వెయ్యేళ్లకు ఒకసారి గరిష్టంగా 39.72 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57.7 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 57.77 మీటర్లు ఉంటుంది.

► పది వేల సంవత్సరాలకు ఒకసారి గోదావరికి గరిష్టంగా 44.61 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 61.41 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 61.43 మీటర్లు ఉంటుంది. 

► కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్‌ మేరకు గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా విడుదల చేసేలా పోలవరంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌వే నిర్మిస్తున్నారు. పోలవరం డిజైన్‌ మేరకు అంటే గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద గోదావరికి వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రాజెక్టు కట్టక ముందు 61.77 మీటర్లు ఉంటే కట్టాక 61.79 మీటర్లు ఉంటుంది.

గేట్ల నిర్వహణే కీలకం
పోలవరం ప్రాజెక్టు గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్‌ వాటర్‌ ప్రభావం కనిష్ట స్థాయిలో ఉంటుందని ఐఐటీ–హైదరాబాద్‌ తేల్చింది. బ్యాక్‌ వాటర్‌ ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. 

► పోలవరంలో నీటి నిల్వలు.. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరదను దిగువకు విడుదల చేసేలా సమర్థంగా గేట్లను నిర్వహించాలి.

► పోలవరం జలవిస్తరణ ప్రాంతంలో నదీ గర్భంలో ఎప్పటికప్పుడు ఇసుక మేటలను తొలగించాలి. దీనివల్ల నీటి మట్టం పెరగదు.

► ముంపును నివారించాలంటే ఎగువన కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాంతాల్లో బ్యారేజ్‌లు నిర్మించాలి.

► పోలవరం డ్యామ్‌ నిర్మించడం వల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భూఉపరితల మట్టం కంటే నీటి ఉపరితల మట్టం రెండు సెంటీమీటర్ల మేర పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రాధాన్యత క్రమంలో పది దశల్లో గోదావరికి ఇరువైపులా 124.55 కి.మీ. పొడవున కరకట్టలు నిర్మించాలి. ఇందుకు రూ.996.4 కోట్ల వ్యయం అవుతుంది. 

మరిన్ని వార్తలు