International Dog Day 2021: ‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’

26 Aug, 2021 16:15 IST|Sakshi

మనిషితో దోస్తీ కట్టినా... రాత్రి వేళ గస్తీ కాసినా.. విశ్వాసానికి మారుపేరుగా నిలిచింది. నాగరికత అడుగులు పడ్డనాటి నుంచి నవీకరణ పరుగులు పెడుతున్న నేటి వరకు మనిషికి నమ్మకమైన నేస్తంగా నిలిచింది. అందుకే ‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’ అంటూ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు మనిషి.  ‘జాలిగుండె లేని కొడుకు కన్నా కుక్క మేలురా’ అని ఓ సినీకవి చెప్పింది ఇందుకే కాబోలు. ఏటా ఆగస్టు 26న అంతర్జాతీయ స్థాయిలో డాగ్‌డేను నిర్వహిస్తున్నారు.

కడప కల్చరల్‌ : ఇంటికి కాపలా కాయడమే కాకుండా తన యజమానికి విశ్వాస పాత్రంగా ఉంటూ కుటుంబ సభ్యులను ప్రమాదాల నుంచి కాపాడటంలో శునకం ముందుంటుంది. గ్రామాలకు కాపలా కాస్తూ దాని సంరక్షణకు కృషి చేస్తుంది గనుక ప్రజలు దాన్ని ‘గ్రామ సింహం’గా గౌరవిస్తారు. పాముకాటు నుంచి కుటుంబ సభ్యులను కాపాడి ఆ సంఘటనలో ప్రాణాలర్పించిన శునకాలెన్నో ఉన్నాయి. తాము పెంచుకునే శునకాలను ప్రాణప్రదంగా చూసుకునే యజమానులు కూడా ఉన్నారు. తమకు ఇష్టమైన పేరు పెట్టుకుని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. నచ్చిన పేరుతో పిలుచుకుంటూ ఎవరైనా దాన్ని ‘కుక్క’ అంటే ఇంతెత్తున ఎగిరిపడతారు. పేరుతో పిలవాలనే యజమానులు కూడా ఉన్నారు.  

20 వేల నుంచి 25 లక్షల దాకా: శునకాల్లో చాలా రకాలు ఉన్నాయి. మంచి బ్రీడ్‌ రకాలు రూ. 20 వేల నుంచి రూ. 25 లక్షల వరకు ఖరీదు చేస్తాయి. ఈ ప్రాంతం వారు ఎక్కువగా బెంగుళూరు నుంచి తెచ్చుకుని పెంచుకుంటారు. ప్రస్తుతం జిల్లాలో 2500 మందికి పైగా శునక ప్రియులు ఉన్నారు. వాటికి ఆహారం విక్రయించేందుకు కట్టె బెల్ట్‌లు, పెంట్‌ హౌస్‌లు, వాటితత్వం తెలిపే పుస్తకాలు విక్రయించే దుకాణాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి.

భైరవా.. మళ్లీ పుడతావురా! 
కడప నగరంలోని సుకన్య దంపతుల పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో వారు ఓ చిన్ని శునకాన్ని తెచ్చుకుని టైసన్‌ అని పేరు పెట్టుకుని దాన్ని ‘మైసన్‌’ అనుకుంటూ పెంచుకున్నారు. అప్పుడప్పుడు వచ్చే వారి పిల్లలు కూడా దాంతో సన్నిహితంగా ఉండేవారు. దాని అరుపులు ఇబ్బందిగా ఉన్నాయని ఇరుగు పొరుగులు అభ్యంతరం తెలిపినా ఇల్లు మారారేగానీ టైసన్‌ను వదల్లేదు. వృద్ధాప్య సమస్యతో రెండేళ్ల కిందట టైసన్‌ మరణించగా  కర్మకాండ నిర్వహించి ఖననం చేశారు. ఏటా సమాధి వద్దకు వెళ్లి అలంకరించి పూజలు చేస్తున్నారు.
 
‘గీత’ దాటదు  
కడప నగరం రాజారెడ్డివీధిలోని అలెగ్జాండర్‌ వద్ద ఎప్పటికీ నాలుగైదు కుక్కలు ఉంటాయి. ఆయన వాటికి పలు రకాల శిక్షణ ఇచ్చి పిల్లల్లాగా చిన్నచిన్న పనులు చేయిస్తుంటాడు. సంపాదనలో సగం వాటికే ఖర్చు చేస్తాడు. చూడ్డానికి భీకర ఆకారంతో భయం గొల్పుతూ ఉన్నా అవి అతని వద్ద స్నేహితుడిలా ఒదిగి ఉంటాయి.పాతికేళ్లుగా ఉన్న ఆయన వద్ద ఉన్న ‘గీత’ అనే శునకం ఏనాడూ చిన్న పిల్లలకు కూడా హాని చేయలేదు. గీత ఇటీవల కొన్ని టీవీ సీరియల్స్‌లో కూడా నటించడం విశేషం.

‘మ్యాక్సీ’మమ్‌ సందడి..  
నగరంలోని నబీకోటకు చెందిన స్థానిక ప్రముఖులు పద్మాకర్‌ శునకాల పెంపకంలో దిట్ట. ఆయన పెంచుకుంటున్న మ్యాక్సీకి ఆయనంటే ఎంతో ఇష్టం. స్వయంగా పెడితేగానీ ఆహారం ముట్టదు. ఆయన వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే దానికి చెప్పి వెళితేగానీ అన్నం తినదు. యజమానిని చూడగానే కులాసాగా అటు, ఇటు తిరుగుతుంది. రావడం ఆలస్యమైతే మందగించినట్లుగా అరుస్తుంది. మరీ ముచ్చటేస్తే మీదికి ఎగబడి ముద్దు చేస్తుంది. రమ్మంటే వచ్చి ఒడిలో సేద తీరుతుంది. కొత్తవాళ్లు వస్తే తెగ హడావుడి చేస్తుంది. ‘మనోళ్లేలే’...అని చెబితేగానీ ఊరుకోదు.

చదవండి: కర్నూలు టీడీపీలో నిస్తేజం.. అధినేత వ్యవహారం నచ్చకే!      

మరిన్ని వార్తలు