‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’లో చేనేత హవా

17 Oct, 2023 04:43 IST|Sakshi

రాష్ట్రం నుంచి ఎంపికైన 14 ఉత్పత్తుల్లో 8 చేనేత ఉత్పత్తులే

తుది దశలో జాతీయ అవార్డుల పరిశీలన

నేటితో పూర్తికానున్న ఇన్వెస్ట్‌ ఇండియా బృందం పర్యటన

సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా–ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) జాతీయ అవార్డుల ప్రక్రియ తుది దశకు చేరింది. ఓడీఓపీ జాతీయ అవార్డు–2023కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఏడాది జూన్‌ 25నుంచి జూలై 31 మధ్య దేశంలోని  751 జిల్లాల నుంచి 1,102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళా ఉత్పత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. వడపోత అనంతరం దేశంలో మొత్తం 63 ఉత్పత్తులను పరిశీలనకు తీసుకున్నారు. వాటిలో ఏపీ నుంచి 14 ఉత్పత్తులకుచోటు లభించింది. వీటిని ఇన్వెస్ట్‌ ఇండియా బృందం (జాతీయ స్థాయి టీమ్‌) క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ నెల 10న మొదలైన ఈ బృందం పర్యటన ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. 

14 ఉత్పత్తులు ఇవే..
రాష్ట్రం నుంచి పరిశీలనకు ఎంపికైన ఉత్పత్తులలో పొందూరు ఖద్దరు (శ్రీకాకుళం), బొబ్బిలి వీణ (విజయనగరం), అరకు కాఫీ (ఏఎస్‌ఆర్‌), సముద్ర రొయ్యలు (విశాఖ), పులగుర్త చొక్కాలు, చీరలు (తూర్పుగోదావరి), ఉప్పాడ జాందానీ చీరలు (కాకినాడ), కొబ్బరి, కొబ్బరి పీచు (అంబేడ్కర్‌ కోనసీమ), మంగళగిరి చేనేత చీరలు (గుంటూరు), పెద్ద రొయ్యలు (బాపట్ల), ఉదయగిరి చెక్క కత్తిపీట (నెల్లూరు), చేనేత సిల్క్‌ చీరలు (కర్నూలు), మదనపల్లె సిల్క్‌ చీరలు (అన్నమయ్య), సిల్క్‌ చీరలు (శ్రీ సత్యసాయి), వెంకటగిరి చీరలు (తిరుపతి) ఉన్నాయి. ఇన్వెస్ట్‌ ఇండియా తరఫున ఆరాధన, హరిప్రీత్‌సింగ్, నమీర అహ్మద్, రాబిన్‌ ఆర్‌ చెరియన్, సోనియా, ఆకాంక్ష, జిగిషా తివారీ బృందం వేర్వేరుగా 8 రోజులపాటు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

అవార్డుకు ఎంపికైతే మంచి మార్కెటింగ్‌
వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తుల ప్రతిభను వెలికితీసి వాటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓడీఓపీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహించేలా అవార్డులు ఇస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 24 జిల్లాల్లో ప్రత్యేకత సంతరించుకున్న 38 రకాల ఉత్పత్తులను ఎంపిక చేసి ఓడీఓపీ జాతీయ అవార్డుకు దరఖాస్తు చేశాం. ఏపీ నుంచి 14 ఉత్పత్తులను తుది పరిశీలనకు ఎంపిక చేయగా.. వాటిలో 8 చేనేత వస్త్రాల ఉత్పత్తులు ఉండటం గొప్ప విషయం. జాతీయ అవార్డుకు ఎంపికైన వాటికి మార్కెటింగ్‌ రంగంలో మంచి గుర్తింపు లభించి ఆయా జిల్లాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుంది. – కె.సునీత, ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర చేనేత జౌళి శాఖ 

మరిన్ని వార్తలు