పరిశ్రమలు క్యూ...

21 Dec, 2023 05:26 IST|Sakshi

ఏపీలో పెట్టుబడులు పెడుతున్న టాటా, బిర్లా, అదానీ, అర్సెలర్‌ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్‌లు

విశాఖ జీఐఎస్‌ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు.. వీటిని అమల్లోకి తీసుకురావడం ద్వారా 6 లక్షల మందికి ఉపాధి 

నాలుగున్నరేళ్లలో 130 భారీ ప్రాజెక్టులతో రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి 

3 పారిశ్రామిక కారిడార్లు.. 4 భారీ పారిశ్రామిక పార్కులు 

సులభతర వాణిజ్యంలో వరుసగా ఏపీకి మొదటి స్థానం

కొత్త పెట్టుబడులను ఆకర్షించడం.. వచ్చిన పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతోంది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణ­యా­లతో గతంలో ఎన్నడూలేని విధంగా ముఖేష్‌ అంబానీ, టాటా, బిర్లా, అదానీ, అర్సెలర్‌ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్‌ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. 

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ఈ ఏడాది జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. ఈ ఒప్పందాలను అమల్లోకి తీసుకురావడం ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 33 యూని­ట్లు ఉత్పత్తులు ప్రారంభించగా మరో 94 ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్నింటి పనులు ప్రారంభదశలో ఉన్నా­యి. వీటికి అదనంగా దావోస్‌ పర్యటనలో మరో రూ.1,26,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది.

వీటి అమలు ద్వారా 38 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు ఒకేచోట లభించేలా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ పేరుతో యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నాలుగున్నరేళ్లలో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 86 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. మూడేళ్ల నుంచి సుల­భ­తర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది.

కొత్తగా 3 పారిశ్రామిక కారిడార్లు.. 
♦ విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్‌ –బెంగళూరు కారిడార్‌. 
♦ విశాఖ–చెన్నై కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా 2 గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ నోడ్‌లను తీర్చిదిద్దింది.  
♦ విశాఖలోని నక్కపల్లి–రాంబిల్లి క్లస్టర్లను, చిత్తూరు నోడ్‌లో ఏర్పేడు, శ్రీకాళహస్తి క్లస్టర్లలో అంతర్గత సదుపాయాలను కలి్పంచారు.  
♦ వీసీఐసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్‌టెర్నల్‌ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్‌ జోన్‌లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్‌ జోన్‌లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేసింది.  
♦  నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.3,051 కోట్ల పెట్టుబడులు, 9,030 ఉద్యోగాలు.  అచ్యుతాపురంలో 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు, 60 వేల మందికి ఉద్యోగాలు.  
♦ ­వీసీఐసీలో భాగంగా వైఎస్సార్‌ జిల్లాలోని కొప్పర్తిలోని 6,740 ఎకరాలలో పరిశ్రమల హబ్‌.  
♦ కొప్పర్తి కేంద్రంగా మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కు, ఎంఎస్‌ఈసీడీపీ, వైఎస్సార్‌ ఈఎంసీ, వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండ్రస్టియల్‌ పార్కు ఏర్పాటుకు ప్రణాళిక. రూ.2,595.74 కోట్ల నిక్‌డిక్ట్‌ నిధులతో అభివృద్ధికి కార్యాచరణ. ఇప్పటికే 66 పరిశ్రమలు కొలువుదీరాయి. రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది.  
♦ కృష్ణపట్నంను పారిశ్రామిక నోడ్‌గా తీర్చిదిద్దుతోంది. తిరుపతి జిల్లాలో క్రిస్‌ సిటీ ఏర్పాటుకు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీనిద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తోంది. 
♦  పారదర్శక పెట్టుబడుల కోసం ప్రభుత్వం ‘పారిశ్రామిక అభివృద్ధి విధానం–2023–27’ను తీసుకొచ్చింది. ‘వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం’ పేరుతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రత్యేక పాలసీ. 9,140 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు. 
♦ వీటికి గత ప్రభుత్వం జూన్‌ 2019 నాటికి పెండింగ్‌లో పెట్టిన రూ. 3,409 కోట్ల ప్రోత్సాహకాలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది.  
♦  11,059 ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు సంబంధించిన రూ.1,324.53 కోట్ల బకాయిలతో పాటు రూ.962.05 కోట్ల బకాయిల (7,039 ఎంఎస్‌ఎంఈలకు మంజూరు) ఎరియర్లను కూడా అందజేసింది. 75 భారీ, మెగా యూనిట్లకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ. 380.85 కోట్ల ప్రోత్సాహకాలను కూడా క్లియర్‌ చేసింది.  
♦  వీటిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న 49 టెక్స్‌టైల్‌ యూనిట్లకు రూ.242.13 కోట్లు ఇచ్చింది. 

సీఎం ప్రారంభించిన కొన్ని ప్రముఖ పరిశ్రమలు.. 
అచ్యుతాపురంలో యకహోమా టైర్స్‌.. 
జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్‌ అనకాపల్లి జిల్లా అచ్యు­తాపురం సెజ్‌లో ఏర్పాటు చేసిన అలయన్స్‌ టైర్స్‌ కంపెనీ (ఏటీసీ)ని సీఎం జగన్‌ 2022 ఆగస్టు 16న ప్రారంభించారు. తొలిదశలో రూ.1,384 కోట్లతో హాఫ్‌ హైవే టైర్ల తయారీ యూనిట్‌ ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్ష ఉపాధి. యకహోమా గ్రూప్‌ విశాఖ యూనిట్‌ను రూ.680 కోట్లతో విస్తరణ చేపట్టింది. 2024 చివరి త్రైమాసికానికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
బిర్లా గ్రాసిం కాస్టిక్‌ సోడా యూనిట్‌.. 

తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూపు సుమారు రూ. 2,700 కోట్లతో కాస్టిక్‌ సోడా తయారీ యూనిట్‌ను 2022 ఏప్రిల్‌ 21న సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. అంతకుముందు 2 నెలల క్రితం బిర్లా గ్రూపు వైఎస్సార్‌ జిల్లాలో గార్మెంట్‌ యూనిట్‌ను ఏర్పాటుచేసింది.  

బద్వేల్‌లో సెంచురీ ప్యానల్స్‌.. 
వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌ సమీపంలోని గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యాన­ల్స్‌ తయారీ యూనిట్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమా­రు రూ.1,600 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ యూనిట్‌ నిర్మాణ పనులకు సీఎం జగన్‌ 2021, డిసెంబర్‌ 24న భూమి పూజ చేశారు. ఈ యూనిట్‌ తొలిదశ పనులను 2024 డిసెంబర్‌ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.   

ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ.. 
తిరుపతి జిల్లా శ్రీసిటీకి ఏసీ తయారీ యూనిట్లు క్యూ కడుతున్నాయి. బ్లూస్టార్, డైకిన్‌ వంటి బ్రాండ్లతో పాటు దేశంలోని 20కి పైగా బ్రాండ్లకు సరఫరా చేసే ఆంబర్, హావెల్స్, ఈప్యాక్‌ డ్యూరబుల్స్, పానాసోనిక్‌–యాంకర్‌ వంటి విడిభాగాల తయారీ యూనిట్లు తమ పెట్టుబడులకు రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నాయి. వీటి ద్వారా రూ.3,755 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా, 9,700 మందికి ఉపాధి కల్పించనున్నాయి.    

కొప్పర్తిలో డిక్సన్‌ ఉత్పత్తి ప్రారంభం.. 
వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌లో ఏఐఎల్‌ డిక్సన్‌ కంపెనీ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. రూ.127 కోట్లతో సీసీటీవీ, ఐపీ కెమెరాలు, డిజిటల్‌ వీడి­యో రికార్డుల తయారీ యూని­ట్‌ను ఏర్పా­టుచేసింది. ఆదిత్య ఇన్ఫోటెక్‌తో కలిసి డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటుచేసిన ఈ యూనిట్‌ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. ఈ యూని­ట్‌ను ఈ ఏడాది జూలై 11న సీఎం జగన్‌ ప్రారంభించారు.  

గుంటూరులో ఐటీసీ స్పైసెస్‌ పార్క్‌.. 
ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీ ఐటీసీ కూడా రాష్ట్రంలో భారీగా విస్తరిస్తోంది. రూ.140 కోట్లతో వెల్‌కమ్‌ పేరుతో గుంటూరులో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను, రూ. 200 కోట్లతో గ్లోబల్‌ స్పైసెస్‌ పార్కులను ప్రారంభించింది. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేసి, ఎగుమతి చేసేలా గ్లోబల్‌ స్పైసెస్‌ పార్కును అభివృద్ధి చేసింది. దీనిని సీఎం జగన్‌ సెపె్టంబర్‌ 2022లో ప్రారంభించారు. ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి కల్పిస్తోంది.   

చిన్న పరిశ్రమలకు చేయూత 
♦ చంద్రబాబు ప్రభుత్వం  దిగిపోయేనాటికి  ఎంఎస్‌ఎంఈల సంఖ్య1,93,530

♦ జగన్‌ సీఎం అయిన తర్వాత కొత్తగా వచ్చిన యూనిట్లు 3.87 లక్షలు  

♦ నాలుగున్నరేళ్లలో కొత్తగా ఉపాధి లభించిన వారి సంఖ్య 12.61 లక్షలు 

♦ ఈ ఏడాది నెలకు సగటున ఏర్పాటైన యూనిట్లు 19,476 

♦ జగన్‌ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు అందించిన ప్రోత్సాహకాలు రూ.2,087 కోట్లు 

♦ ఎంఎస్‌ఎంఈల కోసం  రాష్ట్రంలో ఏర్పాటు  చేస్తున్న క్లస్టర్లు   54  

♦ చంద్రబాబు ప్రభుత్వం  ఎగ్గొట్టిన బకాయిల కోసం జగన్‌ సర్కార్‌ చెల్లించిన మొత్తం రూ.1,588 కోట్లు 

తాజాగా విజయనగరంలో జిల్లా ఎస్‌.కోటలో రూ.531 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఇండ్రస్టియల్‌ పార్కు అభివృద్ధి.. ఇది అందుబాటులోకి వస్తే 35,750 మందికి ప్రత్యక్షంగా, 9,375 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు. అనకాపల్లి, కొప్పర్తిలో కూడా ఎంఎస్‌ఎంఈ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 

>
మరిన్ని వార్తలు