AB Venkateshwar Rao: ఏబీవీ సస్పెన్షన్‌

28 Jun, 2022 22:22 IST|Sakshi

పెండింగ్‌ లో ఉన్న క్రిమినల్‌ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నం

సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం

అనుమతి లేకుండా విజయవాడ విడిచి వెళ్లకూడదని షరతు

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ సమీర్‌శర్మ

సాక్షి, అమరావతి: ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆయనపై గతంలో క్రిమినల్‌ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ విభాగం అదనపు డీజీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశ రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై గతంలో కేసు నమోదైంది.

కేంద్ర హోంశాఖ ఆమోదించడంతో ఆయన్ను 2020, మార్చి 7న సస్పెండ్‌ చేసింది. దీనిపై దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసినట్లు చెప్పింది. కానీ, గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసుల విషయంలో దర్యాప్తును కొనసాగించవచ్చని, అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. 

తదనంతర పరిణామాలతో ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా నియమించింది. కానీ, ఆయన తనపై నమోదైన క్రిమినల్‌ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాల కొనుగోలు, అందుకోసం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టం అనే కంపెనీకి అడ్డగోలుగా లబ్ధి కలిగించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు పెండింగులో ఉంది. ఆ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు వీలుగా టెండరు నిబంధనలు, సాంకేతిక అర్హతలను కూడా మార్చారు.

అంతేకాక.. ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టం కంపెనీకి ప్రయోజనం కల్పిస్తూ 2018, అక్టోబరు 31న రూ.35లక్షలు చెల్లించారు. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్‌టీ ఇన్‌ఫ్లాటబుల్‌ ఆబ్జెక్ట్స్‌ లిమిటెడ్‌/ ఆర్‌టీ ఎల్‌టీఏ సిస్టమ్స్‌ ఉత్పత్తులను భారత్‌లో మార్కెట్‌ సృష్టించేందుకు యత్నించారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ టెక్నికల్, కొనుగోలు కమిటీలను ప్రభావితం చేశారు. ఆ విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా కుట్రపూరితంగా వ్యవహరించిన ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదైంది.

మరోసారి సర్వీసు నిబంధనలు ఉల్లంఘన
ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం సస్పెన్షన్‌ అనంతరం ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు తనపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించడం ద్వారా అఖిల భారత సర్వీసు నిబంధనలను మరోసారి ఉల్లంఘించారు. క్రిమినల్‌ కేసు పెండింగులో ఉన్న అధికారి తన హోదాను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్‌ విధించవచ్చని సర్వీసు నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. ఆ నిబంధనను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును మంగళవారం సస్పెండ్‌ చేసింది. సస్పెన్షన్‌ కాలంలో ముందస్తు అనుమతిలేకుండా విజయవాడను విడిచి వెళ్లకూడదని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.  

మరిన్ని వార్తలు