మెట్ట భూములకు పాతాళగంగ

20 Oct, 2022 12:16 IST|Sakshi

వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా సాగునీరు

రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

మూడేళ్లలో 3 వేలకుపైగా దరఖాస్తులు

రూ. 11.64 కోట్లతో 1,343 బోర్ల ఏర్పాటు

మెట్ట ప్రాంతాల్లో పారుదల నీటి వసతిలేని సన్న, చిన్న కారు రైతుల పొలాలకు పాతాళ గంగను అందిస్తోంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో గడిచిన మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్న అర్హత ఉన్న రైతుల పొలాల్లో ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేస్తోంది. నిపుణుల ద్వారా హైడ్రో, జియాలజికల్, జియోఫిజికల్‌ అన్వేషణతో జలవనరులను గుర్తించి బోరుబావుల తవ్వకానికి అనుమతులు మంజూరు ఇస్తోంది. తద్వారా మెట్ట భూముల్లో రైతులు సిరులు పండించుకోగలుగుతున్నారు.  

నెల్లూరు (పొగతోట):  మెట్ట ప్రాంతాల్లో జలసిరులు అందించి రైతులు సిరులు పండించేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళను ప్రారంభించింది. ఉదయగిరి, ఆత్మకూరు, రాపూరు, మర్రిపాడు, అనంతసాగరం వంటి మెట్ట ప్రాంతాల్లోని బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌ జలకళ ఉపయోగపడుతోంది. ఉదయగిరి, ఆత్మకూరు, మర్రిపాడు తదితర ప్రాంతాల్లో మెట్ట భూములు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాధారంపైనే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ జలకళ పథకాన్ని రైతుల దరిచేర్చేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పథకంపై రైతులకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంది.

2.5 ఎకరాల భూమి కలిగిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రైతుకు ఒకే ప్రాంతంలో 2.5 ఎకరాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి గతంలో బోరు లేకుండా ఉంటే ఈ పథకానికి అర్హులవుతారు. 2.5 ఎకరాల విస్తీర్ణం లేని రైతులు పక్క రైతుతో కలిపి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. చిన్న, సన్న కారు రైతులకు (కుటుంబానికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన) బోరుతో పాటు విద్యుత్‌ కనెక్షన్‌ మోటారు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. 5 ఎకరాల కంటే అధికంగా భూమి కలిగిన కుటుంబాలకు బోరు మాత్రమే తవ్విస్తోంది. అర్హులైన రైతులు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. పంచాయతీ పరిధిలోని క్షేత్ర సహాయకులు, వలంటీర్లు దరఖాస్తు నమోదుకు రైతులకు సహాయపడుతున్నారు.  

నియోజకవర్గానికి ఒక డ్రిల్లింగ్‌ యంత్రం
జలకళ పథకం ద్వారా బోర్లు వేసేందుకు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున డ్రిల్లింగ్‌ యంత్రాలను జిల్లాకు కేటాయించింది. ప్రస్తుతం ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో బోర్లు వేయడం ప్రారంభించారు. ఉదయగిరి నియోజకవర్గంలో రెండు రోజుల్లో వైఎస్సార్‌ జలకళకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు వేగవంతం చేసి బోర్ల తవ్వకానికి అధికారులు అనుమతులు ఇస్తున్నారు. భూగర్భ జలమట్టం అధిక స్థాయిలో ఉన్న రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలుకాదు. హైడ్రో, జియాలజికల్, జియోఫిజికల్‌ సర్వేలు నిర్వహించిన అనంతరమే బోరు బావుల తవ్వకానికి అనుమతి మంజూరు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 3 వేలకు పైగాదరఖాస్తులు అధికారులకు అందాయి. వాటిలో సర్వే పూర్తి చేసి సుమారు 2 వేల బోర్లకు అనుమతి మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ 11.64 కోట్ల ఖర్చుతో 1,343 బోర్లు పూర్తి చేశారు. 

కొత్తగా దరఖాస్తులకు ఆహ్వానం 
వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయిస్తుంది. దరఖాస్తుతో పాటు రైతు పాస్‌ఫొటో, పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు జెరాక్స్‌ కాపీలతో సచివాలయం లేదా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం మరొక పర్యాయం కల్పించింది. పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రైతుల ఫోన్‌ నంబర్లు దరఖాస్తులో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి బోరు డ్రిల్లింగ్‌ చేసేంత వరకు ప్రతి సమాచారాన్ని రైతులకు అందించనుంది.

 రైతులు దరఖాస్తులు చేసుకోవాలి  
పేదల రైతుల పొలాలను సాగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళను అమలు చేస్తోంది. బోరు కావాల్సిన అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. రైతులు ఇబ్బందులు పడకుండా సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకునే వేసులబాటును ప్రభుత్వం కల్పించింది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 
– వెంకట్రావు, డ్వామా పీడీ 

మరిన్ని వార్తలు