పచ్చనేతల బరితెగింపు 

12 Jun, 2022 04:08 IST|Sakshi
గాయపడి చికిత్స పొందుతున్న కౌన్సిలర్‌ రాఘవేంద్ర

తాడిపత్రిలో జేసీ వర్గీయుల దాడి 

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్, కార్యకర్తకు గాయాలు 

పైపులైన్‌ పనులు చేపట్టేందుకు వెళ్లిన కౌన్సిలర్లు 

అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ వర్గీయులు 

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడి 

తాడిపత్రి అర్బన్‌: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పచ్చ నేతలు మరోసారి బరితెగించారు. అభివృద్ధి పనులు చేసేందుకు వెళ్లిన వారిపై తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్‌ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఓ కౌన్సిలర్‌కు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.  గత పాలకులు, కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల ఎస్‌టీపీ – 1కు వెళ్లే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పైపులైన్లు పాడయ్యాయి.

తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వీటిని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యేక చొరవతో మరమ్మతులు చేయిస్తున్నారు. శనివారం ఎస్‌టీపీ–1 వద్ద మరమ్మతు పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. 31వ వార్డు కౌన్సిలర్‌ కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, 35వ వార్డు కౌన్సిలర్‌ రాఘవేంద్రతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, మరమ్మతులు చేసే సిబ్బంది పనులు ప్రారంభించేందుకు ఉదయం అక్కడికి చేరుకున్నారు.

అప్పటికే ఎస్‌టీపీ – 1 వద్దకు కొందరు టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు చేరుకున్నారు. వారి వద్ద సరైన సామగ్రి లేకుండానే పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఫొటోలకు పోజులిచ్చారు. అంతటితో ఆగకుండా టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, విజయ్, జింకా లక్ష్మిదేవితో పాటు ఆ పార్టీ నేతలు పప్పూరు రఘునాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ రాఘవేంద్ర, కార్యకర్త సునీల్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న రూరల్‌ సీఐ చిన్నపెద్దయ్య, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా ఈ దాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ దళిత నాయకులు  ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. జేసీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. 

ఓటమిని జీర్ణించుకోలేక కక్ష సాధింపు చర్యలు
గత సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో ఓడిపోయిన జేసీ కుటుంబీకులు ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తపనతో ఇప్పటి నుంచే కక్షలు, గొడవలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి తన వర్గీయులను రెచ్చగొడుతూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులకు పాల్పడుతున్నారు.  

మరిన్ని వార్తలు