కాకినాడ మత్స్య ల్యాబ్‌కు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు

25 Aug, 2021 08:11 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: కాకినాడలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ)లోని ఆక్వా ల్యాబొరేటరీకి నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు లిమిటెడ్‌ (ఎన్‌ఏబీఎల్‌) గుర్తింపు లభించింది. కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉన్న సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ, చెన్నైలోని ఎక్స్‌పోర్ట్‌ ఇన్‌స్పెక్షన్‌ ఏజెన్సీలతో పాటు నాగపట్నంలోని రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ ఆక్వాకల్చర్‌కు మాత్రమే ఇప్పటివరకు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు ఉంది. రాష్ట్ర స్థాయి ఆక్వా ల్యాబ్‌కు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు లభించడం దేశంలో ఇదే తొలిసారి. కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీలో 2001లో ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత నీటి, మట్టి నాణ్యతల విశ్లేషణ, మైక్రో బయాలజీ, చేపలు, రొయ్యల మేతల నాణ్యత విశ్లేషణ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో 61 రకాల పరీక్షలు చేస్తుంటారు. ల్యాబ్‌లలో మౌలిక వసతులు, సాంకేతిక పరికరాలు, సిబ్బంది నైపుణ్యత, ప్రామాణిక పరీక్షా పద్ధతుల ఆధారంగా ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు కోసం ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేశారు. ఈ ల్యాబ్‌లో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపునిస్తున్నట్టు తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. 

గుర్తింపుతో ప్రయోజనాలు..
ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు వల్ల ఆక్వా రైతులకు, హేచరీలకు, మేత తయారీదారులకు మరింత నాణ్యమైన సేవలందించే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా మేతలు, చేప, రొయ్య పిల్లలను పరీక్షించి వాటికి ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికేషన్‌ ఆధారంగా నాణ్యతా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు