ఎస్‌ఈసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలి

1 Feb, 2021 05:40 IST|Sakshi

పేదలకు రేషన్‌ పంపిణీపై హైకోర్టు వ్యాఖ్యలు హర్షణీయం: మంత్రి కొడాలి నాని

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) త్వరగా నిర్ణయం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కోరారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంటోందని.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందిస్తోందన్నారు.

ఈ క్రమంలోనే ఇంటింటికీ రేషన్‌ బియ్యాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. మంత్రి ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పైలెట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీని అమలుచేసి, అక్కడ ఎదురైన లోటుపాట్ల ఆధారంగా ఈ మొబైల్‌ వాహనాలను తీసుకొచ్చామన్నారు. అయితే, పేదలకు ఎంతో అవసరమైన ఈ పథకం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని, దాన్ని నిలిపివేయాలని సీఎస్‌కి ఎస్‌ఈసీ లేఖ రాశారన్నారు. దీంతో ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం.. న్యాయస్థానం ఐదు రోజుల్లోగా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించడం హర్షణీయమని కొడాలి చెప్పారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ నేతలెవరూ లేకుండానే సోమవారం నుంచి ఇంటింటికీ రేషన్‌ బియ్యాన్ని మొబైల్‌ వాహనాల ద్వారా అందిస్తారని మంత్రి చెప్పారు. ఎస్‌ఈసీ నిర్ణయం వచ్చాకే గ్రామాల్లోనూ అమలు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు