మా గ్రామాలను ఆంధ్రాలో కలపండి

21 Jul, 2021 04:26 IST|Sakshi
రాగి పత్రాన్ని చూపిస్తున్న కొటియా గ్రామస్తుడు

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల డిమాండ్‌

ఏపీ సీఎం జగన్‌ అందిస్తున్న 24 సంక్షేమ పథకాలు అందుకుంటున్నామని వెల్లడి

ఎమ్మెల్యే సమక్షంలోనే ఆధారాల ప్రదర్శన 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత పాలకుల మద్దతు లభించక స్తబ్దుగా ఉన్న ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఇన్నాళ్లకు చైతన్యం వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమకు అందిస్తున్న 24 రకాల సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నామని చెబుతున్నారు. తాము ఆంధ్ర ప్రాంతానికి చెందినవారమేనని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మంగళవారం మరోసారి బయటపెట్టారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని సారిక గ్రామ పంచాయతీ నేరెళ్లవలస సంత వద్ద గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది.  ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని రాయిపాడు, బిట్ర, తొలిమామిడి, సీడిమామిడి, మెట్టవలస, గాంధీవలస, టడుకుపాడు, బొందెలుపాడు, సివర, బొరియమెట్ట, పొడ్డపుదొర తదితర 15 గిరిజన గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ను కలిశారు.
 రాగి రేకుపై రాసిన పన్ను ఒప్పంద పత్రం 

తమ తల్లిదండ్రులు సాలూరు మండలం సారిక గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎంపీ డిప్పల సూరిదొరకు శిస్తు చెల్లించేవారని గుర్తు చేశారు. అందుకు ఆధారంగా రాగిరేకులపై రాసిన ఒప్పందాలను సభలో ప్రదర్శించారు. ఒడిశా ప్రభుత్వం ప్రేరేపించడంతో కొంతమంది నాయకులు, అధికారులు తమ గ్రామాలను ఒడిశా భూభాగంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పూర్తిస్థాయిలో ఆంధ్రా పౌరులుగా గుర్తించేలా చూడాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే రాజన్నదొర స్పందిస్తూ.. ఒడిశా మాదిరిగా తాము దుందుడుకు చర్యలకు పాల్పడబోమని, ఆ రాష్ట్ర చర్యలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వారికి వివరించారు.  

మరిన్ని వార్తలు