KRMB Meeting: వివాదాల ముగింపునకు సిద్ధం.. నేడు కృష్ణాబోర్డు సర్వసభ్య సమావేశం

10 May, 2023 09:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. అనుమతి లేని ప్రాజెక్టులే ప్రధాన అజెండాగా బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ అధ్యక్షతన 17వ సర్వ సభ్య సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలతోపాటు బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు, బడ్జెట్, 2023–24 నీటి సంవత్సరంలో జలాల పంపిణీతో సహా 21 అంశాలతో అజెండాను ఖరారు చేసింది.

కృష్ణా తాగు నీటి సరఫరా పథకం ఒకటి, రెండు, మూడు దశల ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువ కింద ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆయకట్టుకు నీటిని అందిస్తోంది. ఇందుకోసం నాగార్జున సాగర్‌ జల విస్తరణ ప్రాంతంలో రూ.1,450 కోట్లతో సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అభ్యంతరం తెలిపింది. సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్,  పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను నిలిపివేయాలని బోర్డును కోరింది.

నీటి కేటాయింపులు లేనందున పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతిని కూడా సీడబ్ల్యూసీ తిరస్కరించింది. కృష్ణా ట్రిబ్యునల్‌–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) కుడి కాలువను చేపట్టడంపై తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ట్రిబ్యునల్‌ తీర్పు నోటిఫై అయ్యాకే పనులు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్డీఎస్‌ను మరోసారి ప్రస్తావించేందకు తెలంగాణ సిద్ధమైంది. 

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలయ్యేనా? 
బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్నెళ్లలోగా దాన్ని అమలు చేయాలని పేర్కొంది. మరో ఆర్నెల్లు పొడిగించినా నోటిఫికేషన్‌ అమలుపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. దీనిపై రెండు రాష్ట్రాలను ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో 66 శాతం (512 టీఎంసీలు) ఏపీ, 34 శాతం (299 టీఎంసీలు) తెలంగాణ వాడుకునేలా 2015 జూన్‌ 19న తాత్కాలిక ఒప్పందం కుదిరింది. కానీ.. సగ భాగం వాటా కావాలని తెలంగాణ డిమాండ్‌ చేయడంతో నీటి పంపిణీపై కూడా బోర్డు చర్చించనుంది. 

హిందీలో కార్యకలాపాలా? 
కేంద్రంతో బోర్డు ఉత్తర ప్రత్యుత్తరాలు, కార్యకలాపాలు హిందీ భాషలోనే జరగాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ కోరుతోంది. కానీ.. రెండు రాష్ట్రాల అధికారులకు హిందీ భాషలో ప్రావీణ్యం లేదు. దీనిపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల్‌ శక్తిశాఖ అనుమతి లేకుండా బోర్డులో పనిచేస్తున్న సిబ్బందికి మూలవేతనంలో 25శాతం ప్రోత్సాహకంగా ఇచ్చిన నిధులు రికవరీ చేయాలన్న కేంద్రం ఆదేశాలపైనా చర్చించనున్నారు.   

మరిన్ని వార్తలు