సహకార రంగం పునర్వ్యవస్థీకరణ

16 Sep, 2021 03:48 IST|Sakshi

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల సదస్సులో మంత్రి కన్నబాబు

హెచ్‌ఆర్‌ పాలసీకనుగుణంగా త్వరలో బదిలీలు

పీఏసీఎస్, డీసీసీబీ,డీసీఏంఎస్‌లకు ఎన్నికలపై కసరత్తు 

సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ మేరకు సహకార రంగాన్ని అవినీతికి తావులేకుండా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కొత్తగా తెచ్చిన హెచ్‌ఆర్‌ పాలసీకి అనుగుణంగా ఐదేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరినీ త్వరలో బదిలీ చేయనున్నట్లు తెలిపారు. క్యాడర్‌ వారీగా ఉద్యోగుల జీతభత్యాలను సరిచేస్తున్నట్లు వివరించారు. మండలానికో సహకార బ్యాంక్‌ ఏర్పాటు చేసి రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఆర్బీకేల స్థాయిలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలను వికేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. రికార్డుల ట్యాంపరింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు పీఏసీఎస్‌ స్థాయిలో కంప్యూటరైజేషన్‌ చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని ఓ çహోటల్‌లో బుధవారం డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల పునశ్చరణ సదస్సుకు కన్నబాబు హాజరై మాట్లాడారు. గత పాలకులు సహకార చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని పీఏసీఎస్‌లు, సహకార బ్యాంకులను జేబు సంస్థలుగా మార్చుకొని అడ్డగోలుగా దోచుకు తిన్నారని చెప్పారు. నకిలీ డాక్యుమెంట్లతో కాజేసిందంతా కక్కిస్తామని, ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు.

హోదా రాజకీయ పదవి కాదు
బ్యాంకులకు నష్టం చేకూర్చేవారిని ఉపేక్షించొద్దని ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. కొత్తగా నియమితులైన చైర్మన్లు తమ హోదాను రాజకీయ పదవిగా భావించవద్దని సూచించారు. ఆడిటింగ్‌ వ్యవస్థను పటిష్టం చేసి అక్రమాలు వెలుగు చూసిన బ్యాంకుల పరిధిలో ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. ఈసారి పాలక మండళ్లల్లో సహకార రంగ నిపుణులను డైరెక్టర్లుగా నియమించేలా చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు.

డీసీసీబీ–డీసీఎంఎస్‌ల అభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌
డీసీసీబీలు, డీసీఎంఎస్‌లపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా ప్రక్షాళనకు రోడ్‌మ్యాప్‌ రూపొందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. నాడు–నేడు పథకం కింద వీటి అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా పంట రుణాలివ్వాలని సూచించారు. సదస్సులో ఆప్కాబ్‌ చైర్మన్‌ మల్లెల ఝాన్సీరాణి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, ఆర్‌సీఎస్‌ కమిషనర్‌ అహ్మద్‌బాబు, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు