స్వస్థలానికి సాయితేజ భౌతికకాయం.. పచ్చబొట్టు ఆధారంగా గుర్తింపు

11 Dec, 2021 04:21 IST|Sakshi
సాయితేజ కుడిచేతిపై పచ్చబొట్టు (ఫైల్‌ ఫొటో)

బి.కొత్తకోట: ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన బి.సాయితేజ అమరుడై శుక్రవారానికి మూడు రోజులైంది. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించారు. ఆయన మరణ వార్త తెలిసిన బుధవారం సాయంత్రం నుంచి రేగడపల్లెలో విషాదం అలుముకుంది. సాయితేజ కుటుంబాన్ని ఓదార్చేందుకు, పరామర్శించేందుకు ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు తరలివస్తున్నారు.

కడసారి చూపు కోసం అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరామర్శకు ఎవరు వచ్చినా ‘అయ్యా.. నా బిడ్డ ఇంకా రాలేదు’ అంటూ విలపిస్తున్న తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సాయితేజ మృతదేహం రాక కోసం రేగడపల్లె, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని పలు గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. సాయితేజ గురించి తెలిసిన వాళ్లు, ముఖ్యంగా సైనిక ఎంపిక కోసం శిక్షణ పొందిన వారు విలపిస్తున్నారు. సాయితేజ ఇచ్చిన శిక్షణతో ఎంతోమంది సైనికులుగా ఎంపికయ్యారు. వారంతా అతడికి నివాళులర్పించేందుకు మృతదేహం కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో రేగడపల్లెలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది


డీఎన్‌ఏ పరీక్షల్లో జాప్యం 
లాన్స్‌నాయక్‌ సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించేందుకు గరువారం రాత్రి అతడి తల్లిదండ్రులు భువనేశ్వరి, తండ్రి మోహన్, తమ్ముడు మహేష్‌బాబు, కుమారుడు మోక్షజ్ఞల నుంచి సేకరించిన రక్త నమూనాలను ఢిల్లీ తీసుకెళ్లారు. అందరి శ్యాంపిల్స్‌ సేకరణ పూర్తయ్యాక జెనెటిక్‌ ల్యాబ్స్‌లో డీఎన్‌ఏ పరీక్షలు జరిపి మృతదేహాన్ని అప్పగిస్తామని అధికారులు సాయితేజ కుటుంబ సభ్యులకు తెలిపారు. శనివారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తి అయింది. 

సాయితేజ శరీరంపై ఉన్న పచ్చబొట్టు గుర్తుల ఆధారంగా అతడి భౌతిక కాయాన్ని గుర్తించారు. పచ్చబొట్ల వివరాలను, ఫొటోలను ఢిల్లీ సైనిక అధికారులకు వివరాలను సాయితేజ తండ్రి మోహన్‌ తెలిపారు. సాయితేజ ఎడమ వైపు గుండె భాగంపై  భార్య పేరు ఆంగ్లంలో శ్యామ అని, కుడిచేతి మీద త్రిశూలం ఆకారంలో శివుడిబొమ్మతో కూడిన పచ్చబొట్లు ఉన్నాయి.  

సాయితేజ ఇంట్లో విషణ్ణవదనాలతో కుటుంబసభ్యులు, బంధువులు 
 

మరిన్ని వార్తలు