హెల్త్‌ హబ్‌ల కోసం భూముల గుర్తింపు

15 Jun, 2021 04:34 IST|Sakshi

ఒకటి, రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రధాన నగరాల్లో 16 హెల్త్‌హబ్‌లు నిర్మించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు స్థలాల కోసం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం జగన్‌కు ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చారు. అనంతపురంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో 30 ఎకరాలు.. సుమారు రూ.24 కోట్లు అవుతుందని, అదే కాకినాడలో 30 ఎకరాలు రూ.27 కోట్లు అవుతుందని తేల్చారు. గుంటూరు జిల్లాలో ఒకచోట 16.54 ఎకరాలు, మరో చోట 22 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు.

కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 20 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూములను గుర్తించారు. ఇక కర్నూలు జిల్లాలో ఒక చోట 58.44 ఎకరాలు, మరోచోట 52.45 ఎకరాల ప్రభుత్వ భూములు హెల్త్‌సిటీకి అనువుగా ఉన్నాయని నిర్ధారించారు. శ్రీకాకుళం జిల్లాలో 30 ఎకరాల ప్రైవేటు స్థలం గుర్తించగా.. దీని విలువ రూ.15 కోట్లు ఉంటుందని తేలడంతో మరో చోట 10 ఎకరాల ప్రభుత్వ భూమిని చూశారు. విశాఖలో 30 ఎకరాలు, విజయనగరంలో 74.80 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకచోట 32 ఎకరాలు, మరోచోట 50 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఇవి రెండూ ఏలూరు కార్పొరేషన్‌కు సమీపంలో ఉన్నవే. పైన పేర్కొన్న అన్ని స్థలాలూ ఆయా జిల్లాల కార్పొరేషన్లకు అత్యంత సమీపంలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములే గుర్తించినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు