అమరావతి అసైన్డ్‌ అక్రమాలు.. పచ్చ గద్దల కొత్త చిట్టా

23 Oct, 2022 02:23 IST|Sakshi

భూ సమీకరణకు అవతల వేలాది ఎకరాలు కొనుగోలు 

ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ కోసమే మూడు రాజధానులపై విషం 

చంద్రబాబు హయాంలో బెదిరించి బడుగుల భూములు కాజేసిన వైనం

కారుచౌకగా సొంతం.. ప్రభుత్వ స్థలాలూ హస్తగతం

హక్కుదారులొకరు.. ఒప్పందం మరొకరు.. 

రెవెన్యూ రికార్డులకు విరుద్ధంగా సీఆర్‌డీఏ రికార్డులు..

రూ.4 వేల కోట్ల విలువైన 964.88 ఎకరాలు అన్యాక్రాంతం

ఇది రాజధాని ముసుగులో చంద్రబాబు బృందం భూ దోపిడీ 

వడ్డాది శ్రీనివాస్‌
ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది మరోదారన్న సామెత చంద్రబాబుకు, ఆయన పచ్చ గ్యాంగ్‌కు అతికినట్లు సరిపోతుంది. ఏమీ లేని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు మాత్రమే డిమాండ్‌ చేస్తుండగా.. యావత్‌ రాష్ట్ర ప్రజలంతా అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ మూడు రాజధానులకు జై కొడుతున్నారు. న్యాయమైన వీరందరి ఘోషను ఏమాత్రం వినిపించుకోని బాబు అండ్‌ కో ఎందుకు ఇంతగా ఒక్క అమరావతి కోసమే పట్టుపట్టిందంటే వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి.

భూ సమీకరణకు అవతల కారుచౌకగా కొట్టేసిన భూములను కాపాడుకునేందుకే ఈ తాపత్రయమని స్పష్టమవుతోంది. ఆ భూములను బంగారు బాతుగా మార్చుకునే అవకాశం చేజారిపోతోందన్న భయం వారిని బెంబేలెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసైన్డ్‌ భూములను ఎల్లో గ్యాంగ్‌ కాజేసే నాటికే ఆ ప్రాంతంలో ఎకరం రూ.కోటి పలుకుతోంది. ప్రభుత్వం లాక్కుంటే ఏమీ ఇవ్వదనే ఆందోళనతో అసైన్డ్‌ రైతులు తమ భూములను చంద్రబాబు బినామీలకు విక్రయించారు.

ఆ తర్వాత వాటిని టీడీపీ నేతలే ఇచ్చినట్లు సీఆర్‌డీఏ 
రికార్డుల్లో నమోదైంది. ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా టీడీపీ నేతలే భూ సమీకరణ కింద ఇచ్చినట్టు రికార్డుల్లో పొందుపరిచారు. ఈ కుట్ర అంతా 2014 జూన్‌ నుంచి 2015 డిసెంబర్‌లోగా పూర్తి చేశారు. ఆ తర్వాత తాపీగా అసైన్డ్‌ భూములకు కూడా పరిహారం చెల్లిస్తామంటూ 2016 ఫిబ్రవరి 17న గత సర్కారు జీవో 41 జారీ చేసింది. ఇలా టీడీపీ పెద్దలు ఏకంగా 964 ఎకరాలకుపైగా అసైన్డ్‌ భూములను హస్తగతం చేసుకున్నారు.

నాటి సీఎం చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ప్రకారమే అభివృద్ధి చేసిన తర్వాత అమరావతిలో భూముల విలువ ఎకరా కనీసం రూ.4 కోట్లు. అంటే వారు సొంతం చేసుకున్న అసైన్డ్‌ భూముల విలువ ఏకంగా రూ.4 వేల కోట్లు! అప్పటికే రాజధాని ఎక్కడ వస్తుందో వారికి ముందే తెలుసు కాబట్టి చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతిలో భూ సమీకరణ పరిధికి అవతల వేలాది ఎకరాలను బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటి విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అసైన్డ్‌ భూముల దోపిడీ వాటికి అదనం. 

అమరావతిలో టీడీపీ నేతలు కొల్లగొట్టిన అసైన్డ్‌ భూములు (మార్క్‌ చేసినవి) 

964 ఎకరాల అసైన్డ్‌ భూములు కొల్లగొట్టారు
అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన ప్రాంతాన్ని కోర్‌ క్యాపిటల్‌గా చంద్రబాబు సర్కారు మాస్టర్‌ ప్లాన్‌లో ప్రకటించింది. అదే ప్రాంతంలో ఎల్లో గ్యాంగ్‌ అసైన్డ్‌ భూములను కాజేసింది. 2014 వరకు అసైన్డ్‌ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్‌ భూములిచ్చినట్లు సీఆర్‌డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటి? అనే విషయంపై అధికారుల దర్యాప్తులో బండారం మొత్తం బయట పడింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్‌ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్‌డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. ఆ స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి.

ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. అందులో 20 గ్రామాల పరిధిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్‌ భూములు 636.75 ఎకరాలున్నాయి. ఇక ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా  వదల్లేదు. ఏకంగా 328.13 ఎకరాల ప్రభుత్వ భూములను టీడీపీ పెద్దలు తమ బినామీల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డులు తారుమారు చేశారు. 2014 నాటి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్లతో సహా ఉన్న వివరాలకు, భూ సమీకరణ కింద తీసుకున్నట్లు సీఆర్‌డీఏ రికార్డుల్లో ఉన్న వివరాలు సరిపోలడం లేదు. ఆ భూములన్నీ అసైన్డ్‌ జాబితాలోని 3, 4 కేటగిరీల కిందకు వస్తాయి. వెరసి టీడీపీ పెద్దలు ఏకంగా 964.88 ఎకరాల అసైన్డ్‌ భూములను కాజేశారు. 

ఇదిగో.. దందా ఇలా..
►అమరావతి పరిధిలోని వెంకటపాలెం రెవెన్యూ సర్వే నంబరు 295/10తో ఉన్న 1.02 ఎకరాల అసైన్డ్‌ భూమి రికార్డుల ప్రకారం గొర్రెముత్తు కాంతారావు అనే రైతు పేరిట 2015 వరకు ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద ఇచ్చినట్లుగా సీఆర్‌డీఏ రికార్డుల్లో బడే ఆంజనేయులు పేరుతో ఉంది. అందుకు ప్రతిగా రాజధానిని అభివృద్ధి చేసిన తర్వాత ఎకరాకు 800 గజాల కమర్షియల్‌ స్థలం, 200 గజాల నివాస స్థలాన్ని బడే ఆంజనేయులుకు ఇస్తామని సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్‌ భూమి హక్కుదారు కాంతారావు కాగా, సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది మాత్రం బడే ఆంజనేయులతో కావడం గమనార్హం.
►అమరావతిలోని మందడంలో ‘454/3సీ’ సర్వే నంబరుతో 1.50 ఎకరాల అసైన్డ్‌ భూమి పిల్లి వెంకయ్య అనే రైతుకు అసైన్‌ చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అదే భూమిని గుమ్మడి సురేశ్‌ భూ సమీకరణ కింద ఇచ్చినట్లు సీఆర్‌డీఏ రికార్డుల్లో నమోదైంది. ఎకరాకు 800 గజాల కమర్షియల్‌ స్థలం, 200 గజాల నివాస స్థలం గుమ్మడి సురేశ్‌కు ఇస్తామని సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్‌ భూమి హక్కుదారు వెంకయ్య కాగా, సీఆర్‌డీఏ నుంచి అభివృద్ధి చేసిన భూమిని పొందేది గుమ్మడి సురేశ్‌. సీఆర్‌డీఏ రికార్డుల్లో ఇలాంటి చిత్రాలెన్నో కనిపిస్తాయి. వీరంతా పాత్రధారులు కాగా, అసలు సూత్రధారులు టీడీపీ పెద్దలే. 
►వెంకటపాలెంలో సర్వే నంబరు 296/5తో ఉన్న 0.94 ఎకరాల అసైన్డ్‌ భూమి అన్నూరి హేమలత అనే రైతు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద కొట్టి కృష్ణ దొరబాబు ఇచ్చినట్లు సీఆర్‌డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. 
►కురగల్లు సర్వే నంబరు 500/1తో ఉన్న 0.72 ఎకరాలు కత్తిపోగు కోటేశ్వరరావు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమిని శీలం శ్రీను అనే వ్యక్తి ఇచ్చినట్లు సీఆర్‌డీఏ రికార్డుల్లో ఉంది. ఇదే గ్రామంలో సర్వే నెం 501/1తో ఉన్న 0.80 ఎకరాల అసైన్డ్‌ భూమి బుల్ల కోటమ్మ పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, గడిపర్తి శ్రీను సీఆర్‌డీఏకు ఇచ్చినట్లు నమోదైంది.

పాదయాత్ర అసలు గుట్టు ఇదే.. 
అమరావతిలో బినామీల పేరిట అసైన్డ్‌ భూములను కాజేసిన టీడీపీ నేతలు భూ సమీకరణ పరిధికి అవతల కూడా వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. వాటిలో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ కంపెనీ, ఆయన సన్నిహితుడు లింగమనేని రమేశ్, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌ కుటుంబం, పి.నారాయణ, పరిటాల సునీతలతోపాటు టీడీపీ హయాంలో మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు చెందిన వేలాది ఎకరాలున్నాయి. ఆ భారీ రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యం కోసమే మూడు రాజధానుల విధానాన్ని చంద్రబాబు అండ్‌ కో వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ రైతుల ముసుగులో పెత్తందారులు, రియల్‌ ఎస్టేట్‌ సిండికేట్‌ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ, సీఆర్‌డీఏ రికార్డుల సాక్షిగా బట్టబయలైంది. 

ఓ బ్రాహ్మణుడు పాల కోసం మేకను కొనుక్కొని వెళ్తుంటే దారిలో ముగ్గురు దొంగలు ఒకరి తర్వాత ఒకరు అటకాయించి అది మేక కాదు.. కుక్క అని నమ్మబలుకుతారు. ముగ్గురూ అదే మాట చెప్పడంతో ఆయన తన వెంట ఉన్నది కుక్కేనని భ్రమించి మేకను వదిలేసి వెళ్లిపోతాడు. ఇదే అదనుగా కాచుకున్న ఆ ముగ్గురు దొంగలు మేకను అపహరిస్తారు. ఈ కథ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సరిగ్గా అదే రీతిలో గత ప్రభుత్వ హయాంలో పచ్చ దొంగలు అమరావతిపై గద్దల్లా పడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులను భయాందోళనలకు గురిచేసి.. అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములను కాజేశారు. అసైన్డ్‌ భూములకు ఎలాంటి పరిహారం రాదంటూ రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారుల ద్వారా బెదిరించి కారుచౌకగా కొట్టేశారు. ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే అమరావతి జపం చేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకుంటూ మూడు రాజధానులపై విషం చిమ్ముతున్నారు.

మరిన్ని వార్తలు