అసాధ్యం నేడు సుసాధ్యం

27 Feb, 2021 05:41 IST|Sakshi
అవుకు సొరంగంలో మట్టి పొరలు పడిపోయిన ప్రాంతంలో ఫోర్‌ఫిల్లింగ్‌ పరిజ్ఞానంతో పనులు చేస్తున్న దృశ్యం

అవుకు సొరంగం పనుల్లో అత్యాధునిక పోర్‌ ఫిల్లింగ్‌ టెక్నాలజీ 

హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి నిపుణుల రాక 

ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు విజయవంతం 

మిగిలిన 165 మీటర్ల పనులు శరవేగంగా పూర్తి 

ఐదేళ్లలో అరకొర పనులనూ పూర్తి చేయలేక చేతులెత్తేసిన టీడీపీ సర్కారు 

సొరంగాన్ని తవ్వాల్సిందేనని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం 

గాలేరు–నగరి ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించాలని ఆదేశం 

సాక్షి, అమరావతి: గత పాలకులు అసాధ్యమని వదిలేసిన పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సుసాధ్యం చేస్తోంది. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు సొరంగం పనులు  ఇందుకు తార్కాణం. బలహీనమైన మట్టిపొరలు పనులకు అడ్డంకిగా మారాయనే సాకుతో మిగిలిన 165 మీటర్ల పొడవున సొరంగాన్ని తవ్వలేక గత సర్కార్‌ చేతులెత్తేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిమాలయాల్లో సొరంగాలు తవ్వడానికి ఉపయోగిస్తున్న పోర్‌ ఫిల్లింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మట్టిపొరలు పడిపోయిన ప్రాంతంలో సొరంగాన్ని తవ్వడం ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేస్తోంది.  

వైఎస్సార్‌ హయాంలోనే సింహభాగం పనులు.. 
శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీలను తరలించడం ద్వారా వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్‌ఆర్‌ఎంసీ) నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు తరలించేలా కాలువ తవ్వే క్రమంలో అవుకు వద్ద 6 కి.మీ. పొడవున జంట సొరంగాల (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యం)ను తవ్వాలి. ఇందులో 5.835 కి.మీ. పొడవున సొరంగాల తవ్వకం పనులను 2009 నాటికే పూర్తి చేశారు. రెండు సొరంగాల్లోనూ 165 మీటర్ల మేర మాత్రమే పనులు మిగిలాయి. 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్‌ సొరంగాల్లో మిగిలిన పనులను పూర్తి చేయలేక చేతులెత్తేసింది. చివరకు ఒక సొరంగంలో బలహీన పొరలు ఉన్న ప్రాంతం నుంచి కాలువ(లూప్‌) తవ్వి చేతులు దులుపుకొంది.
 
హిమాచల్‌ నుంచి నిపుణులు.. 
అవుకు సొరంగాన్ని పూర్తి చేయడం ద్వారా వచ్చే సీజన్‌లో ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి ద్వారా తరలించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనాన్ని ఉపయోగించడం ద్వారా సొరంగాన్ని పూర్తి చేయడంపై కర్నూలు ప్రాజెక్టŠస్‌ సీఈ మురళీనాథ్‌రెడ్డి దృష్టి సారించారు. హిమాలయాల్లో సొరంగాలను తవ్వడంలో ఉపయోగించే ‘పోర్‌ ఫిల్లింగ్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవుకు సొరంగంలో వినియోగించాలని నిర్ణయించారు. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి నిపుణులను రప్పించి పనులను ప్రారంభించారు.

పోర్‌ ఫిల్లింగ్‌ పరిజ్ఞానంతో పనులు ఇలా.. 
సొరంగంలో మట్టిపొరలు బలహీనంగా ఉండి పడిపోయిన ప్రాంతంలోకి పైపులను చొప్పిస్తారు. వాటి ద్వారా పాలీయురిథిన్‌ ఫోమ్‌ను అధిక ఒత్తిడితో పంపుతారు. ఈ ఫోమ్‌ మట్టిపొరల్లోకి చేరడంతో  పొరలు పటిష్టవంతమవుతాయి. భవిష్యత్‌లో కూడా మట్టిపొరలు పడిపోకుండా ఇనుపచువ్వల (సెల్ఫ్‌ డ్రిల్లింగ్‌ యాంకర్‌ బోల్ట్స్‌)ను  దించుతారు. దీంతో బలహీనంగా ఉన్న మట్టిపొర కాంక్రీట్‌ దిమ్మె తరహాలో పటిష్టంగా మారుతుంది. ఆ తర్వాత సొరంగాన్ని తవ్వుతారు. అవుకు సొరంగంలో గత సర్కార్‌ అసాధ్యమని వదిలేసిన పనులను ఈ విధానంలో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన 2.5 మీటర్ల పని విజయవంతంగా పూర్తయింది. దీంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు. వచ్చే సీజన్‌లో గాలేరు–నగరి ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేయనున్నారు. 

మరిన్ని వార్తలు