నారాయణ లేకుండా ష్యూరిటీలా?

17 May, 2022 04:59 IST|Sakshi

నారాయణను కోర్టుకు హాజరుపరచాలన్న మేజిస్ట్రేట్‌ 

చిత్తూరు అర్బన్‌: పది ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌ వ్యవహారంలో నిందితుడు మాజీ మంత్రి నారాయణను తమ ముందు హాజరుపరచాలని చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. నారాయణ లేకుండా జామీనుకు ష్యూరిటీలు తీసుకోవడం కుదరదన్నారు. మాల్‌ప్రాక్టీస్‌ వ్యవహారంలో గతవారం చిత్తూరు పోలీసులు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసి ఇన్‌చార్జి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచడం తెలిసిందే. రిమాండ్‌ను తిరస్కరించిన ఇన్‌చార్జి మేజిస్ట్రేట్‌.. నారాయణను సొంత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఇద్దరు జామీను ఇవ్వాలని ఆదేశించారు.

ఇందుకు నారాయణ న్యాయవాదులు 5 రోజుల గడువు తీసుకున్నారు. సోమవారం చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో ఇద్దరు వ్యక్తులను జామీనుగా నారాయణ న్యాయవాదులు హాజరుపరిచారు. దీనిపై మేజిస్ట్రేట్‌ శ్రీనివాస్‌ స్పందిస్తూ నిందితుడు రాకుండా ష్యూరిటీలను తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఈ విషయమై నారాయణ న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను నివేదించడానికి సమయం కోరడంతో మేజిస్ట్రేట్‌ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు