గూడ్స్‌ రైలుని హైజాక్‌ చేసిన మావోయిస్టులు 

19 Sep, 2022 05:53 IST|Sakshi
గూడ్స్‌ రైలుకు మావోయిస్టులు కట్టిన బ్యానర్‌

భాన్సీ సమీపంలో 10 నిమిషాలు రైలుని ఆపిన వైనం  

సిబ్బందికి కరపత్రాలిచ్చి.. పంచమని ఆదేశాలు 

సాక్షి, విశాఖపట్నం: దంతెవాడ–కిరండూల్‌ సెక్షన్‌లో వెళ్తోన్న కేవీఎస్‌ 11 నంబర్‌ గూడ్స్‌ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. బచెలి–భాన్సీ బ్లాక్‌ సెక్షన్‌ 433 కి.మీ సమీపంలో గూడ్స్‌ వెళ్లే ట్రాక్‌ పైకి 50 మంది మావోయిస్టులు చేరుకున్నారు. ట్రాక్‌కి అడ్డంగా నిలబడి రెడ్‌ క్లాత్‌ చూపుతూ..ట్రైన్‌ని నిలిపివేయాలని ఆదేశించారు. అప్రమత్తమైన సిబ్బంది.. ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి. రైలుని ఆపారు.

ట్రైన్‌లోకి మారణాయుధాలతో మావోయిస్టులు ప్రవేశించి డ్రైవర్, ఇతర సిబ్బంది, వెనుక భాగంలో ఉండే గార్డ్‌ నుంచి వాకీ టాకీలు తీసుకున్నారు. మిగిలిన కొందరు ట్రాక్‌పై కాపలా కాయగా..కొంతమంది లోకోమోటివ్‌కి బ్యానర్‌ కట్టారు. అనంతరం కొన్ని కరపత్రాల్ని గూడ్స్‌ రైలు సిబ్బందికి ఇచ్చి దంతెవాడ వరకూ వెళ్లి అక్కడ పంపిణీ చేయాలని ఆదేశించారు. 10 నిమిషాల తర్వాత రైలు దిగి మావోయిస్టులు అడవిలోకి వెళ్లడంతో అక్కడి నుంచి రైలు బయలుదేరి భన్సీకి చేరుకుంది.

వాల్తేరు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి ఆ సెక్షన్‌ పరిధిలో మిగిలిన రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలని ఆదేశించారు. కోరస్‌ కమాండో బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టి..రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరిస్తామని డీఆర్‌ఎం తెలిపారు. కాగా, సెప్టెంబర్  21 నుంచి 27 వరకు 18వ క్రాంతి కారీ వార్షికోత్సవాన్ని దేశమంతా నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని కరపత్రాల్లో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు