శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైజాక్‌ కలకలం

10 Oct, 2023 07:35 IST|Sakshi

శంషాబాద్‌: ఓ తప్పుడు ఈ మెయిల్‌ సందేశంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. మరి కొద్ది నిమిషాల్లో టేకాఫ్‌ తీసుకునే విమానం సైతం రద్దు కావడంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు.. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 8 గంటలకు ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ–951 విమానం 111 మంది ప్రయాణికులతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమైంది. మరికాసేపట్లో టేకాఫ్‌ తీసుకునే సమయంలో ఎయిర్‌పోర్టుకు ఈ మెయిల్‌లో ఓ సందేశం వచ్చింది. అందులో బాదినేని తిరుపతయ్య అనే వ్యక్తి ఐఎస్‌ఐకు ఇన్‌ఫార్మర్‌గా ఉన్నాడని అతడు కాసేపట్లో విమానాన్ని హైజాక్‌ చేయనున్నాడని సాధ్యమైతే వెంటనే అతడిని ఆపాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అతడికి సహకరించే వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపారు.

దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌ బృందంతో విమానంలోకి వెళ్లి ప్రయాణికులందరి తనిఖీ చేశారు. ప్రయాణికులను అందులోంచి దించి వేసి, విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. మెయిల్‌లో పేర్కొన్న తిరుపతయ్యతో పాటు వినోద్‌కుమార్‌, రాకేష్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

దుబాయ్‌ మీదుగా వీరు ఇరాక్‌ వెళుతున్నట్లు సమాచారం. తిరుపతయ్యతో సన్నిహితంగా ఉండే ఓ మహిళే అతడి ప్రయాణాన్ని అడ్డుకునేందుకు మెయిల్‌ పంపినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మెయిల్‌ ఉన్న సమాచారం నిజం కాదని నిర్ధారించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది...? ఎవరు పంపారు..? అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. మెయిల్‌ పంపిన వ్యక్తులను అరెస్ట్‌ చేసేందుకు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రాంచందర్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు