అజాత శత్రువు

22 Feb, 2022 04:44 IST|Sakshi
పేపర్‌ చదువుతున్న గౌతమ్‌రెడ్డి, వెనుక తనయుడు కృష్ణార్జున్‌రెడ్డి

వివాద రహితుడు.. అందరివాడు

సంయమనమే గౌతమ్‌రెడ్డి అసలు రహస్యం

సాక్షి, అమరావతి/నెల్లూరు: రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రువుగా వెలుగొందారు మేకపాటి గౌతమ్‌రెడ్డి. పన్నెండేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఆద్యంతం వివాద రహితుడిగానే మెలిగారు. ఆర్థికంగా స్థితిమంతుడు.. సీనియర్‌ రాజకీయ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కుమారుడైనా గౌతమ్‌రెడ్డి అత్యంత సాధారణంగానే వ్యవహరించారు. రాజకీయాలకు అతీతంగా అందరివాడిగా మన్ననలు పొందారు. వ్యాపారవేత్తగా ఉంటూ తనకేమాత్రం సరిపడని రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మృదుస్వభావిగానే కొనసాగారు. ప్రత్యర్థులపై ఏనాడూ వ్యక్తిగత విమర్శలు చేయకపోవడం హుందాతనానికి నిదర్శనం. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఎన్నికలు అయిపోగానే రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టేసి ప్రజా సమస్యలపైనే దృష్టి సారించేవారు. అందుకే ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు కూడా ఆయనతో గౌరవ ప్రదమైన సంబంధాలనే కొనసాగించారు. గౌతమ్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సైతం దుందుడుకుగా వ్యవహరించలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఏనాడూ అహంకారం ప్రదర్శించలేదు. ప్రతిపక్ష నేతగా ఆనాడు ప్రజా సమస్యలు, విధానపరమైన అంశాలపైనే స్పందించారు తప్ప వివాదాస్పదుడు కాలేదు. అందుకే ఆయన విమర్శలను కూడా ఆనాటి ప్రభుత్వాలు తిప్పికొట్టలేకపోయేవి. ఆయన లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికే ప్రాధాన్యమిచ్చేవి. 

మంత్రిగానూ హుందాగానే..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కీలక మైన పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా నియమితులైన తరువాత కూడా గౌతమ్‌రెడ్డి హుందాతనంతో కూడిన రాజకీయాలే నెరిపారు. ప్రతిపక్ష టీడీపీ కూడా అసెంబ్లీ సమావేశాల్లోగానీ బయట గానీ గౌతమ్‌రెడ్డిని విమర్శించే సాహసం చేయలేకపోయింది. మంత్రిగా సమర్థవంతమైన పనితీరు కనబర్చిన ఆయన తనను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఏనాడూ అవకాశం ఇవ్వలేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు అంశంపై ప్రతిపక్ష టీడీపీ ఓ సారి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. పరిశ్రమల శాఖ మంత్రిగా సమాధానమిస్తూ.. గౌతమ్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి చేపట్టిన చర్యలు, వాటి సత్ఫలితాలను వివరించారు. ఎక్కడా ప్రతిపక్ష టీడీపీని ఒక్క మాట అనకుండా.. ఎదురుదాడి చేస్తున్నట్టుగా కాకుండా ఆయన సవివరంగా ఇచ్చిన సమాధానంతో టీడీపీ మిన్నుకుండిపోయింది.

వర్గ రాజకీయాలు లేవు.. అవినీతి మరకా లేదు
ఎత్తులు, జిత్తులతో నిత్యం వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే నెల్లూరు జిల్లాలో గౌతమ్‌రెడ్డి తనదైన శైలిలో వివాద రహితుడుగా గుర్తింపు పొందడం విశేషం. వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆయన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్నప్పటికీ దానిని అవకాశంగా చేసుకుని జిల్లాపై రాజకీయ ఆధిపత్యం చెలాయించేందుకు యత్నించలేదు. ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలను కలుపుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోని అరుదైన రాజకీయ నేతగా గౌతమ్‌రెడ్డి గుర్తింపు పొందారు. కనీసం రాజకీయ ప్రయోజనాల కోసమైనా ప్రతిపక్షాలు ఆయనపై అవినీతి ఆరోపణలు చేసేందుకు సాహసించలేదు.  గౌతమ్‌రెడ్డి ఎవర్నీ ఏకవచనంతో సంభోదించే వారు కాదు.  

మరిన్ని వార్తలు