ఇది ప్రజల మేలుకోరే బడ్జెట్‌

15 Mar, 2022 04:37 IST|Sakshi

సంక్షేమం, అభివృద్ధికి నిధులు కేటాయింపు

గతంలో అభివృద్ధి గ్రాఫిక్స్‌లో కనిపిస్తే.. ఇప్పుడు ప్రజల మోముల్లో కనిపిస్తోంది

ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్‌ 

సాక్షి, అమరావతి: కరోనా వంటి క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని టీడీపీ కుయుక్తులు పన్నుతోందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ప్రజలన్నా, ప్రజా సంక్షేమమన్నా ప్రతిపక్షానికి గౌరవం లేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే అద్భుతమైన పాలన అందించిందని, 2022–23 వార్షిక బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చిందని వివరించారు. శాసన సభలో బడ్జెట్‌పై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి అంటే గ్రాఫిక్స్‌లో కనిపించేదని, ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోందని అన్నారు. చంద్రబాబు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తే రైతుల మేలుకోరి రూ.1.10 లక్షల కోట్లు వెచ్చించిన గొప్ప ప్రభుత్వం తమదన్నారు. ఈ బడ్జెట్‌లో రూ.43 వేల కోట్లను రైతులకు కేటాయించారని, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ 2020–21 సర్వే ప్రకారం వ్యవసాయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని అన్నారు.  

అభివృద్ధిని అడ్డుకోవడమే టీడీపీ లక్ష్యం 
రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందని, అందుకోసమే శాసనసభలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. గతంలో మాదిరిగా ఓట్ల కోసం చేసే రాజకీయాలు ఇప్పుడు లేవని, ఇప్పడంతా ప్రజారంజక పాలన నడుస్తోందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే బడ్జెట్‌లో ప్రతిబింబించాయన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ఏనాడూ అమలు చేయలేదని, తాము ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షం ఓర్చుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు.

ఉపాధి హామీ పథకాన్ని ఏపీలో అమలు చేయొద్దని కేంద్రానికి లేఖ రాసిన నీచ సంస్కృతి టీడీపీదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఓట్ల కోసం కాదని.. భవిష్యత్‌ తరాల మేలు కోసమని చెప్పారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడే ప్రతి మాటకు చంద్రబాబు అనుమతి కావాలన్నారు. అనంతరం దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక, హిందూ మత సంస్థల ఎండోమెంట్స్‌ చట్ట సవరణ బిల్లును, ఎక్సైజ్‌ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి స్వదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, విదేశీ మద్యం వ్యాపార క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లు్లను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లును వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం సభలో ప్రవేశపెట్టారు.

మరిన్ని వార్తలు