Minister Ambati Rambabu: ‘లీక్‌ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే’

10 May, 2022 15:11 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాతే ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నారాయణ అరెస్ట్‌పై టీడీపీ చేస్తున్న రాద్దాంతాన్ని అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ఆధారాలతో సహా అరెస్ట్‌ చేస్తే దీనిపై టీడీపీ గందరగోళం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు.

‘లీక్ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే. రాష్ట్రంలో జరిగే చాలా విషయాల్లో ఇలానే చేస్తున్నారు. వాళ్లేమో లీక్ చేయొచ్చు...యాక్షన్ మాత్రం తీసుకోవద్దా...?, నిర్వహణ లోపం ఏమిటి..? నారాయణ స్కూల్ కి పరీక్షా పత్రం ఇవ్వొద్దంటారా..?, మీకు నెంబర్ వన్ ఎలా వస్తుంది..? ఇలాంటి లీక్‌ల వల్ల నంబర్‌వన్‌ ర్యాంక్‌ వస్తుంది. విచారణ తర్వాతే నారాయణను అదుపులోకి తీసుకున్నారు. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్‌ స్టేట్‌మెంట్‌ తర్వాతే విషయం బయటకొచ్చింది.

పేపర్లు లీక్‌ చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు.పేపర్‌ లీకేజీల వల్లే నారాయణ విద్యాసంస్థలకు నంబర్‌వన్‌ స్థానం. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో నారాయణ ఉన్నారని ప్రాథమికంగా నిర్థారించారు. వాళ్లేమో లీక్‌ చేయొచ్చు.. యాక్షన్‌ మాత్రం తీసుకోవద్దా?, నారాయణను అరెస్ట్ చేయాలని మాకేంటి...?, ఈ స్కాంలో నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలతోనే అరెస్ట్ చేశారు. జనం మాత్రం జరుగుతున్న వాస్తవాలు చూస్తూనే ఉన్నారు. పేపర్ లీక్ చేసేది మీరు.. రాజీనామా చేయాల్సింది బొత్స సత్యనారాయణా..?’ అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. 

చదవండి👉ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ

మరిన్ని వార్తలు