సబ్సిడీపై రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ: కన్నబాబు

8 May, 2021 16:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సబ్సిడీపై రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామని, ఈనెల 10 నుంచి రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈనెల 17 నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సీఎం అదేశాలకు అనుగుణంగా విత్తనాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేశాం. రైతుల నుండే విత్తనాలు తీసుకుని ప్రాసెసింగ్ చేసి మళ్లీ రైతులకు అందిస్తున్నాం.

సీఎం జగన్ ఆదేశాలతో ఈ పద్ధతిని అమలు చేస్తున్నాం. గత ఏడాది విత్తనాల పంపిణీని గ్రామ స్థాయి నుండి ప్రారంభించాం. ఈ ఏడాది మరింత సమర్థవంతంగా విత్తనాలు పంపిణీ చేస్తాం. విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కి గంటల తరబడి ఎండలో నిలబడే పరిస్థితి గతంలో ఉండేది. సీఎం జగన్ ఆలోచనలతో రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే పంపిణీ చేస్తున్నా’’మన్నారు.

>
మరిన్ని వార్తలు