ఇదెక్కడి ‘చిల్లర’ నామినేషన్‌!.. 4 గంటలపాటు హైడ్రామా 

24 Feb, 2023 08:26 IST|Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి రూ.10 వేలు చిల్లర తెచ్చిన అభ్యర్థి 

లెక్కపెట్టిన విశాఖపట్నం కలెక్టరేట్‌ సిబ్బంది

రూ.6 వేలు మాత్రమే ఉన్నాయని తేల్చిన వైనం

సాక్షి, విశాఖపట్నం: ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి.. చిల్లర లెక్కిస్తూ కొందరు కనిపిస్తున్నారు కదా..! ఇదేదో దేవాలయంలో హుండీ లెక్కింపునకు సంబంధించిన చిత్రం అనుకుంటే పొరపాటే. ఇ­ది విశాఖపట్నం కలెక్టరేట్‌లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ కేంద్రం. అయితే ఇక్కడ చిల్లర ఏంటి అని అనుకుంటున్నారా?.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి పేరు.. ఎన్‌.రాజశేఖర్‌. ఈయన పట్టభద్రుడు.

ప్రస్తుతం శ్రీముఖలింగం దేవాలయ ప్రధానార్చకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని­కల్లో నామినేషన్‌ వేయడానికి తన వద్ద ఉన్న చిల్లర మొత్తాన్ని డిపాజిట్‌గా కట్టేందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిల్లరని అధికారులకు రూ.10 వేలు అని చెప్పి అందించారు. ఆ చిల్లర మొత్తం చూసి సిబ్బంది మొత్తం షాక్‌ అయ్యారు. చిల్లరంతా పోగేసి నలుగురైదుగురు సిబ్బంది లెక్కపెట్టారు

ఇందుకు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. రూపాయి, రూ.2, రూ.5 నాణేల్ని లెక్కించగా మొత్తం రూ.6 వేలే ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కాసేపు రాద్ధాంతం కూడా జరిగింది. మిగిలిన మొత్తాన్ని నోట్ల రూపంలో చెల్లించి.. చివరికి నాలుగు గంటల హై­డ్రామా అనంతరం రాజశేఖర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశా­రు. ఏదే­మైనా.. ఈ చిల్లర మొత్తం లెక్కపెట్టి.. నామినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే సరికి తలప్రాణం తోకకొచ్చిందని ఎన్నికల సిబ్బంది వాపోయారు.
చదవండి: కావలిలో దారుణం.. చిన్నారి గొంతు కోసిన సైకో  

మరిన్ని వార్తలు