ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది

11 Nov, 2020 19:09 IST|Sakshi

బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు

బీసీలంతా ఆయన వెంటే ఉంటారు

బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు

సాక్షి, విశాఖపట్నం: బీసీ కార్పొరేషన్లలో సగం మహిళకే కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తమది బీసీల పార్టీ అని, నామినేటెడ్ పనులు, పదవుల్లో బీసీలకు 50 శాతం అవకాశం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కేబినెట్‌లో బడుగు బలహీన పెద్దపీట వేసిన ఘనత కూడా సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో బడుగు బలహీన వర్గాల్లో 86 శాతం మందికి లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. గవర కార్పొరేషన్ ఏర్పాటు నేపథ్యంలో స్థానిక గురజాడ కళాక్షేత్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతాభినందన సభ ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమరానాథ్, పెట్ల ఉమామ శంకర్ గణేష్, తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు, గవర, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్లు బొడ్డేడ ప్రసాద్, కోలా గురువులు, కేకే రాజు, దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(చదవండి: బాబు మార్కు రాజకీయం.. బీసీలకు విలువలేని పదవులు)

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. గవర కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. ‘‘గవర అంటే గౌరవనీయులు అని అర్ధం. భారతదేశ చరిత్రలో బీసీ కార్పొరేషన్లు చిరస్థాయిగా నిలిసిపోతాయి. బీసీలకు రాజకీయంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్‌ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలు అంటే సమాజానికి వెన్నుముక వంటి వారని సీఎం భావిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల 15 నెలల్లో రెండు వేల కోట్ల పైగా బీసీలకు 25 వేల కోట్ల లబ్ది చేకూరింది’’ అని పేర్కొన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. బీసీలకు 10 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్ పేరు చెప్పి బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు వారి పేరు ఎత్తే అర్హత లేదని చురకలు అంటించారు.(చదవండి: కేంద్ర బృందాన్ని పంపినందుకు ధన్యవాదాలు)

బీసీలు అంటే బ్యాక్‌బోన్‌ కాస్ట్‌
బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాథ్ ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని,  బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా సీఎం గుర్తించారని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ‘‘గవర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. బీసీలందరూ ఆయనకు రుణపడి ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన వెంటే ఉంటారు’’ అని పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు