త్వరలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ పేరు మార్పు

23 Aug, 2023 05:02 IST|Sakshi
ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో మాట్లాడుతున్న బండి శ్రీనివాసరావు

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వెల్లడి 

గెజిటెడ్‌ అధికారులకూ సభ్యత్వం ఇవ్వనున్నట్లు ప్రకటన

ముగిసిన అసోసియేషన్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు 

సాక్షి, అమరావతి: ఇప్పటివరకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌గా ఉన్న తమ సంఘం పేరును త్వరలో ఏపీ నాన్‌ గెజిటెడ్‌ అండ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ (ఎన్‌జీజీవో) అసోసియేషన్‌గా మార్పు చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. సంఘం రాష్ట్ర 21వ కౌన్సిల్‌ సమావేశాల్లో రెండో రోజు ఆయన మాట్లాడారు. సంఘం పేరు మార్చేందుకు తీర్మానం చేసినట్లు చెప్పారు.

గెజిటెడ్‌ అధికారులకు సంఘంలో సభ్యత్వం ఇచ్చేందుకు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. గతంలో తమ సంఘంలో ఉన్న ఉద్యోగులు కొందరు గెజిటెడ్‌ ఆఫీసర్‌ ర్యాంకులోకి వెళ్లారని, దీంతో వారిని కూడా సంఘంలో చేర్చుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచామని, వీలైనంత వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు.

ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి డిమాండ్లను సాధించుకుంటామన్నారు.సంఘం నిర్వహించే మహాసభలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించడం 7 దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే సీఎం జగన్‌ను ఆహ్వానించామని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం అంగీకరించడం శుభ పరిణామమన్నారు.

కౌన్సిల్‌ సమావేశాల ముగింపు సందర్భంగా జిల్లాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవాలని, మరింత మంది మహిళలకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించాలని తీర్మానించారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సురేష్‌ లాంబ, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు