ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌కు మించి సౌకర్యాలు 

28 Jul, 2023 03:36 IST|Sakshi
ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఐసీయూ వార్డులను పరిశీలిస్తున్న మంత్రి  రజిని, ఎమ్మెల్యే  విష్ణు

 వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని 

విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో నవజాత శిశు వైద్య విభాగాలు ప్రారంభం

లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కూడా లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిన నవజాత శిశు వైద్య విభాగాలు ఎస్‌ఎన్‌సీయూ(స్పెషల్‌ న్యూ బోర్న్‌ కేర్‌ యూనిట్‌), ఎన్‌ఐసీయూ (నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)లను గురువారం మంత్రి ప్రారంభించారు. ప్రసూతి విభాగంలో ఇప్పటికే 250 పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా 40 పడకలను నవజాత శిశు వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు.

తక్కువ బరువు, కామెర్లు వంటి అనారోగ్య కారణాలతో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర విభాగ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఎస్‌ఎన్‌సీయూలు, ఎన్‌ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అదనంగా రూ.31.51 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడి ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామని రజిని తెలిపారు. కాగా, రాజీవ్‌నగర్‌లోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, వైఎస్సార్‌ సీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాశ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు