కరోనా కారణంగా వాయిదా సాధ్యం కాదు

4 Nov, 2020 02:43 IST|Sakshi

‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ సిద్ధం 

హైకోర్టుకు నివేదించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌

బ్యాలెట్‌ బాక్సులు వచ్చిన వెంటనే దశల వారీ ఎన్నికలకు షెడ్యూల్‌ 

హింసాత్మక ఘటనలు జరిగిన ఎన్నికల రద్దుకు ఏకాభిప్రాయం

నాకు, ఎన్నికల కమిషన్‌కు భద్రత పెంచాల్సిన అవసరం ఉంది

ఎప్పటిలాగే ప్రభుత్వంపై పలు నిందారోపణలు

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ హైకోర్టుకు నివేదించారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే బ్యాలెట్‌ బాక్సుల కొరత ఉందని, అవి అందుబాటులోకి వచ్చిన వెంటనే షెడ్యూల్‌ను విడుదల చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పూర్తయిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ఎన్నికలను రద్దు చేసి, వాటిపై విచారణ జరిపించే విషయంలో రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని వివరించారు.

ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తనతో పాటు ఎన్నికల కమిషన్‌కు భద్రతను పెంచాలన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్, మరికొందరు గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు ఇటీవల సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు మరోసారి విచారణకు వచ్చాయి. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ అదనపు కౌంటర్‌ దాఖలు చేశారు. నిమ్మగడ్డ తన కౌంటర్‌లో ఎప్పటి లాగే రాష్ట్ర ప్రభుత్వంపై పలు తీవ్రమైన నిందారోపణలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని శంకించేలా కౌంటర్‌లో పలు విషయాలు ప్రస్తావించారు.

కరోనా వల్ల అప్పుడు వాయిదా వేశాం..
కరోనా తీవ్రత నేపథ్యంలో స్థానిక సంస్థలను అప్పుడు వాయిదా వేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేసిందన్నారు. బిహార్‌లో తొలిదశ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. తెలంగాణలోనూ మున్సిపల్‌ ఎన్నికలను ప్రకటించిందని వివరించారు. కమిషన్‌ ఇటీవల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిందని, తగిన జాగ్రత్తలతో ఎన్నికలు కొనసాగించాలని రాజకీయ పార్టీలు కోరాయని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం నిర్వహించామని, కరోనా సెకండ్‌ వేవ్‌ గురించి మౌఖికంగా తెలియచేశారన్నారు. 

సొంత బ్యాలెట్‌ బాక్సుల్లేవు...
మొదటి దశలో ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుంటే, ఈసారి ఎన్నికల్లో మరింత ఎక్కువ హింస జరిగే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా బ్యాలెట్‌ బాక్సుల కొరత తలెత్తిందని, ఏపీకి సొంతగా ఎలాంటి బ్యాలెట్‌ బాక్సులు లేవని తెలిపారు. బ్యాలెట్‌ బాక్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.  

మరిన్ని వార్తలు