ఆర్టీసీ ఉద్యోగులకూ న్యాయం చేయండి

23 Jan, 2022 04:20 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌కు ఎన్‌ఎంయుఎ వినతి

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతన వ్యత్యాసం సరిచేసి, పాతపెన్షన్‌కు అనుమతించాలని, ఇంటి అద్దెలు, సీసీఏలు పాతవి కొనసాగించాలని సీఎం వైఎస్‌ జగన్‌కి నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయుఎ) విజ్ఞప్తి చేసింది. ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిన సీఎంకు కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు శనివారం ప్రకటన విడుదల చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో నాలుగేళ్లకు ఓసారి వేతన సవరణ జరిగేదని తెలిపారు. 2017 ఏప్రిల్‌ 1న 25శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరిగిందని పేర్కొన్నారు. అనంతరం 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిందని, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు 19శాతం వేతన వ్యత్యాసం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2020 జనవరి 1 నుంచి బకాయి ఉన్న కరువు భత్యంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫిట్మెంట్‌ను కలిపి 2021 ఏప్రిల్‌ 1 నుంచి వేతన సవరణ చేసి.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు